విభజన గొడ్డలికి వైయస్ ఒక్కరే అడ్డు పడ్డారు: షర్మిల
కాకినాడ: రాష్ట్ర విభజన గొడ్డలికి వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కరే అడ్డు పడ్డారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల అన్నారు. ఆమె సమైక్య శంఖారావం బస్సు యాత్ర శనివారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. శ్రీకృష్ణ కమిటీ సూచనలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీ ఎందుకు విభజించాలని ఆమె అడిగారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎవరికి లాభం, తెలుగు జాతి ఒక్కటిగా ఉంటే ఎవరికి నష్టమని ఆమె అడిగారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వంటి ముఖ్యమంత్రి ఆవిర్భవిస్తే తట్టుకోలేని బలహీనత ఎవరికి ఉందని ఆమె అడిగారు. మంచి పనులు చేసి ఓట్లు, సీట్లు సంపాదించుకునే సత్తా కాంగ్రెసు పార్టీకి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ రోజు ఈ గతి పట్టేది కాదని షర్మిల అన్నారు. చెడు చేసైనా సరే స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెసు పూనుకుందని ఆమె విమర్శించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని ఆమె అన్నారు. ఒక్క వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమే విభజన అనే గొడ్డలికి అడ్డంగా నిలబడి ఒకే ఒక్కడిగా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడారని ఆమె అన్నారు. అసలు అన్యాయం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వైయస్ రాజశేఖర రెడ్డి రోశయ్య కమిటీని వేశారని ఆమె చెప్పారు.
2009లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకున్నా, నాలుగు పార్టీలు కలిసి ఏకధాటిగా యుద్ధం చేసినా వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కడిగా నిలబడి ఒంటి చేత్తో పోరాటం చేసి ఆ ఎన్నికల్లో గెలిచారని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి తప్ప ప్రత్యేక రాష్ట్రం కాదని వైయస్ నిరూపించినట్లు ఆమె తెలిపారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా 2008 అక్టోబర్ 18వ తేదీన కేంద్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను షర్మిల చదివి వినిపించారు.












Click it and Unblock the Notifications