5గురు వైసిపి ఎమ్మెల్యేలు జంప్?: 'ప్రకాశం ఖాళీ'పై ఎమ్మెల్యే కౌంటర్
విశాఖ/దర్శి: ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైసిపికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 27 లేదా 28న టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది.
ఆయనతో పాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యేల ముత్తుముల అశోక్ రెడ్డి మే మొదట వారంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో చేరనున్నారని అంటున్నారు.
వైసిపి అధినేత జగన్‌కు, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డికి సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా సైకిల్ ఎక్కేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల వైసిపి గెలిచింది. అందులో యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఇటీవలే టిడిపిలో చేరారు. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు అదే దారిలో నడుస్తున్నారని తెలుస్తోంది.

కోట్లకు అమ్ముడుపోను: మార్కాపుర ఎమ్మెల్యే
తాను కోట్లకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేను కానని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్రం బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని చెప్పారు. ఎన్నికల హామీలు మరిచి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా, సోమవారం నాడు జగన్ విశాఖలో గుడివాడ అమర్నాథ్ దీక్షను విరమింప చేశారు. అమర్నాథ్ విశాఖ రైల్వే జోన్ కోసం నాలుగు రోజుల పాటు దీక్ష చేశారు. ఆదివారం సాయంత్రం పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. సోమవారం జగన్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.












Click it and Unblock the Notifications