నెల్లూరు రాజకీయాల్లో అనూహ్యం- వైసీపీ సంచలనం: మేకపాటి నియోజకవర్గంలో కీలక మార్పు
నెల్లూరు జిల్లా రాజకీయాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించిన ప్రస్తుత పరిస్థితుల్లో మరో కీలక నిర్ణయం వెలువడింది. ఉదయగిరి నియోజకవర్గం అబ్జర్వర్ ను మార్చేసింది.
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. పార్టీకి చెందిన జిల్లా నాయకుల ప్రక్షాళణ చేపట్టినట్టే కనిపిస్తోంది అగ్రనాయకత్వం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గల దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ మున్ముందు మరిన్ని కీలక మార్పులు చోటు ఉంటాయనే సంకేతాలను పంపించింది.

ఆనంతో తిరుగుబాటు మొదలు..
మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు, తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి.. అధికార పార్టీపై తిరుగుబాటు బావుటా లేవదీశారు. సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. బహిరంగంగానే. ప్రభుత్వ పెద్దలను విమర్శించారు. అధికార యంత్రాంగాన్నీ తప్పుపట్టారు. మంత్రి పదవి లభించకపోవడం వల్లే ఆయన పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారనే విషయం బహిరంగ రహస్యమే.

కోటంరెడ్డితో ఊపు..
ఇప్పుడు అదే బాటలో నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుస్తోన్నారు. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తనను అనుమానించిన, అవమానించిన పార్టీలో ఒక ఉండకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు. అందుకే బహిరంగంగా తాను మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తోన్నారంటూ ఆయన సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు.

ఉదయగిరిపై..
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం జిల్లాలోని కీలక నియోజకవర్గాలపై దృష్టి సారించింది. తొలుత- ఉదయగిరిపై ఫోకస్ చేసింది. ఇక్కడ పార్టీ పరిశీలకుడిని మార్చివేసింది. ఇప్పటివరకు అబ్జర్వర్ గా వ్యవహరిస్తోన్న కొడవలూరు ధనుంజయ రెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో మెట్టుకూరు ధనుంజయ రెడ్డిని నియమించింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది.

జగన్ ఆదేశాలతో..
ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించిన తరువాత- చిన్న చిన్న అంశాలకూ ప్రాధాన్యత ఇస్తోంది. లోపాలను ఏ మాత్రం ఉపేక్షించదలచుకోనట్టే కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న కొడవలూరు ధనుంజయరెడ్డి స్థానంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియమించినట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది.

గతంలో కాంగ్రెస్ లో..
మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఛైర్మన్ గా వ్యవహరించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇఫ్పుడాయనను ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకుడిగా నియమించింది పార్టీ.












Click it and Unblock the Notifications