Amaravati: మోడీ సభకు హాజరుపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..?
ఏపీలో అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కోసం ప్రధాని మోడీ రేపు రాష్ట్రానికి వస్తున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దీనికి 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సభకు హాజరు కావాలని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అందరికీ ఆహ్వనాలు పంపుతోంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూడా ఆహ్వనం పంపింది.
అయితే ప్రధాని మోడీ సభకు హాజరయ్యే అంశంపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో సభకు వెళ్లకపోతేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మోడీ సభకు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా అధికారులతో దీన్ని పంపడంపై వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ప్రోటోకాల్ అధికారులు జగన్ ఇంటికి వెళ్లి ఆయన సింహాచలం వెళ్లినట్లు తెలుసుకుని పీఏకు ఆహ్వానం ఇచ్చి వచ్చేశారు.

గతంలో అమరావతి శంఖుస్థాపనకు అప్పటి మంత్రి రావెల కిషోర్ బాబుతో సీఎం చంద్రబాబు జగన్ కు ఆహ్వానం పంపారు. అప్పుడు కూడా జగన్ సభకు హాజరు కాలేదు. ఇప్పుడు కూడా ప్రధాని మోడీ సభకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ సాయంత్రానికి ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏకైక విపక్ష పార్టీ నేతగా ఉన్నప్పటికీ విపక్ష నేత హోదా ఇవ్వకపోవడం, ఇప్పుడు అమరావతిలో ప్రధాని సభకు కూడా ఎమ్మెల్యే హోదాలోనే తనను ఆహ్వానించడంపై అసంతృప్తిగా ఉన్న జగన్ ఈ సభకు దూరంగా ఉండిపోతున్నట్లు సమాచారం.
మరోవైపు అధికారికంగా మోడీ సభకు రావాలని ఆహ్వానాలు పంపుతున్న ప్రభుత్వం ఈ తంతును మొక్కుబడిగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ సభ ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం నియమించినప్పటికీ వీరు వీఐపీలను స్వయంగా ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు ఇదే కారణంతో జగన్ మోడీ సభకు రావడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications