మాచర్ల ఘటనపై టీడీపీకి వైసీపీ కౌంటర్ ..వీడియోతో మొత్తం బట్టబయలు
ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. అయితే పోలింగ్ అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో హింస చేలరేగింది. ముఖ్యంగా పల్నాడు నియోజకవర్గంలో చేలరేగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే పోలింగ్‌కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది. అయితే పోలింగ్ నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో వైసీపీని కార్నర్ చేస్తూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ ఘటనపై వైసీపీ స్పందించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను మాత్రమే బయటపెట్టారని..అంతకుముందు ఆ బూత్‌లో జరిగిన రిగ్గింగ్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్కడున్న సీసీ కెమెరాలు ఆపి మరీ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందని సమాచారం అందుకున్న తర్వాతే పిన్నేల్లి అక్కడకు వెళ్లి ఈవీఎం ధ్వంసం చేశారని వైసీపీ చెబుతోంది.
తాజాగా మాచర్లలో టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తపై దాడి చేసిన వీడియోను విడుదల చేశారు. పోలింగ్ బూత్‌లో టీడీపీ నేతల ఆగడాలు చూడండి అంటూ వైసీపీ కూడా వీడియోను రిలీజ్ చేయడంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తుమ్మురుకోటలో టీడీపీ బీభత్సం చేసిన మొత్తం వీడియోలు విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పల్నాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications