మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్
మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. అంబటి రాంబాబుకు సొంత పార్టీ నుంచే నిరసన సెగ ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సత్తెనపల్లి వైసీపీ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అంబటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని..వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే పరిస్థితి లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. పైగా అంబటి వ్యవహారశైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రిని వేరే నియోజకవర్గానికి మార్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా అంబటి సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తే, వచ్చే ఎన్నికల్లో 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోతారని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని నరసారావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి స్థానిక వైసీపీ నేతలు తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాకుండా అడ్డుకోవాలని అనిల్ కుమార్ యాదవ్‌ను కోరారు.

అంబటి రాంబాబు తీరు వల్ల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని సత్తెనపల్లి వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్‌ను కోరారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి ,కోడెల శివప్రసాదరావు చేతిలో ఓటమి పాలైయ్యారు.
2019 ఎన్నికలకు వచ్చే సరికి అదే కోడెల శివప్రసాద్‌రావును ఓడించి జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ఈసారి టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగనుండటంతో అంబటి గట్టి పోటీ ఎదుర్కొనున్నారు. అయితే ఇటువంటి సమయంలోనే సొంత పార్టీ నేతలు అంబటికి వ్యతిరేకంగా పావులు కదపడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications