ఎంపీ అభ్యర్దులుగా జగన్ మార్క్ ఎంపిక - సినీ ప్రముఖలకు ఖరారు..!?
ఏపీలో ఎన్నికల అభ్యర్దులపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్దుల తుది జాబితా ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారు. ఇప్పటికే 60 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలను ప్రకటించారు. ఇక, టీడీపీ - జనసేన తొలి జాబితా వచ్చే నెల తొలి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ సమయంలో సినీ ప్రముఖులకు సీఎం జగన్ ఎంపీ సీట్లు ఖరారు దిశగా అడుగులు వేస్తోంది.
సీఎం జగన్ అభ్యర్దుల ఖరారు తుది దశకు చేరింది. ఇప్పటికే జగన్ ఎన్నికల సమర శంఖం పూరించారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేసారు. పది మంది పార్లమెంట్ సభ్యులను ప్రకటించారు. మరో 15 మంది ఎంపీ అభ్యర్దుల ప్రకటనకు సిద్దమయ్యారు. ప్రకాశం, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇదే తుది జాబితాగా పార్టీ నేతలు చెబుతున్నారు. నగరి సీటు నుంచి మంత్రి రోజాను మార్పు చేసి..ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది. నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖాయమైంది. గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు కుమారుడు పేరు రేసులో ఉంది.

ఇక..కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్ తో పాటుగా సినీ హీరో సుమన్ పేరు పరిశీలనలో ఉంది. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పేరు ఖాయం చేసారు. కర్నూలు నుంచి బీవై రామయ్యను ఖరారు చేసారు. నంద్యాల నుంచి మైనార్టీ వర్గానికి ఎంపీ సీటు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీ కోసం పని చేస్తున్న సినీ నటుడు ఆలీకి అవకాశం ఖాయమని చెబుతున్నారు. దీని పైన ఇంకా తుది నిర్ణయం జరగలేదని జిల్లా పార్టీలో చర్చ సాగుతోంది. రాజంపేట, కడప నుంచి ప్రస్తుత ఎంపీలనే తిరిగి పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. దీంతో, తుది జాబితాలో జగన్ ప్రకటించే పేర్లు..స్థానాల పైన పార్టీలో ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications