ఏదో జరుగుతోంది, తెలంగాణ కంటే ఎక్కువా: 'పవర్' లెక్క చెప్పిన బుగ్గన

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రెండు పవర్ ప్రాజెక్టుల పైన అనుమానం వ్యక్తం చేశారు. ఏదో జరుగుతోందని, రూ.2500 కోట్ల స్కాం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇందుకు సంబంధించి ఆయన దేశంలో, ఇతర రాష్ట్రాలలో విద్యుత్ ఉత్పత్తి ధరలు ఎలా ఉన్నాయి, ఏపీలో ఎలా ఉన్నాయో సోదాహరణంగా వివరించారు. అలాగే, విద్యుత్ కష్టాలే లేనప్పుడు కష్టాల్లో ఉన్న ఏపీలో విద్యుత్ ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు.

బుగ్గన మాట్లాడుతూ... 30 ఏప్రిల్ 2015న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఓ విషయం చెప్పారని, భారత దేశంలో విద్యుత్ సర్ ప్లస్ ఉందని చెప్పారని, ఆ సమయంలో ట్రేడింగ్ కూడా సున్నాగా ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2.2 శాతం మాత్రమే విద్యుత్ కొరత ఉందని బుగ్గన చెప్పారు.

నిన్న గెలిపించినోళ్లే..: బాబు అభిమానించే జిల్లాలో జగన్‌కు పట్టం!
తెలంగాణలో..

దేశవ్యాప్తంగా ఏ పరిస్థితి ఉందో ఏపీలోను అదే పరిస్థితి ఉందని చెప్పారు. కొన్నేళ్ల క్రితం చెన్నైలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదన్నారు. ఇప్పుడు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలోను రెండేళ్ల క్రితం విద్యుత్ కొరత ఉండేదని, ఇప్పుడు దానిని అధిగమించారన్నారు.

బొగ్గు తక్కువ ధరకు దొరకడం, పెట్రోలియం సెస్ తక్కువ అయిన తదితర కారణాల వల్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని, కొరత లేకుండా పోయిందన్నారు. పవర్ ప్లాంట్లు మేమే స్థాపించామని ఎవరు చెప్పిన సరికాదన్నారు. ఓ పవర్ ప్లాంట్ కావాలంటే ఐదారేళ్లు పడుతుందన్నారు.

YSRCP many doubts on AP government

ప్రాజెక్టులు అనవసరం

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముందు ముందు కూడా మనకు విద్యుత్ కొరత ఉండదని అర్థమవుతోందన్నారు. ఇప్పుడు ఏపీలో విద్యుత్ డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉందన్నారు. రాబోయే ఐదారేళ్లు మనకు విద్యుత్ కొరత ఉండదని చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు రెండుచోట్ల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎందుకని ప్రశ్నించారు.

రాజకీయ వ్యవస్థపై జగన్ ఆసక్తికర వ్యాఖ్య, బాబుపై తీవ్ర ఆగ్రహం
ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో విద్యుత్ ప్రాజెక్టుల పైన వివిధ రకాల కథనాలు వస్తున్నాయని చెప్పారు. క్రెడిబిలుటీ ఉన్న పత్రికలలోనే ఆ వార్తలు వస్తున్నాయని చెప్పారు. తమకు చెందిన కంపెనీలకు అనుకూలంగా విద్యుత్ ప్రాజెక్టులు మార్చే అవకాశముందని చెబుతున్నాయన్నారు.

ఇవీ లెక్కలు

తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టును చూస్తే మెగావాట్‌కు రూ.4.76 కోట్లు, గుజరాత్‌లో ఓ ప్రాంతంలో రూ.4.36 కోట్లు, మధ్యప్రదేశ్‌లోని బరేలీలో రూ.3.94 కోట్లు ఖర్చవుతోందని చెప్పారు.

ఏపీలో మాత్రం మెగావాట్‌కు రూ.6 కోట్ల కంటే ఎక్కువ ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. ఎన్టీపీసీలో రూ.5.85 కోట్లు ఖర్చవుతోందన్నారు. కృష్ణపట్నంలో ఒక్కో మెగావాట్‌కు రూ.6.3 కోట్లు ఖర్చవుతోందన్నారు.

ఈ రోజు దేశవ్యాప్తంగా రూ.4 కోట్లకు అటు ఇటు చేస్తుంటే, ఏపీలో మాత్రం ఇంత ఎక్కువ ఎందుకని ప్రశ్నించారు. ఒక్క యూనిట్‌కు ఇంత అంటే 800 యూనిట్లకు లెక్క వేస్తే రూ.2500 కోట్ల తేడా వస్తోందన్నారు ఇంత తేడా ఎందుకు వస్తుందో చూడాల్సిన అవసరముందన్నారు.

ఇలాంటివి గతంలో చరిత్రలో జరగలేదన్నారు. అనవసరమైన ప్రాజెక్టులను అర్జెంటుగా కట్టడం, ఇంత ఎక్కువ ధరకు కట్టడం, ప్రాజెక్టుల అప్పగింత పైన బుగ్గన అనుమానం వ్యక్తం చేశారు. పనులు ఎవరికి అప్పగించాలో వారికే ఇచ్చేలా తయారు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం పైన మండిపడ్డారు.

పట్టిసీమ టెక్నాలజీ

దీనికి పట్టిసీమ టెక్నాలజీ అని పేరు పెట్టవచ్చునని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల అప్పగింత ఎవరికి కావాలంటే వారికి ఇచ్చేలా చేయడం ఈ టెక్నాలజీ అని చంద్రబబు ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఎవరికి ప్రాజెక్టులు అప్పగించాలో వారికి సూటయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు.

ఎవరైనా ఆఫీస్‌కు వస్తే సూట్ వేసుకొని రమ్మని, టై కట్టుకొని రమ్మని చెబుతారని, ఏపీ ప్రభుత్వం మాత్రం పసుపు పచ్చ టై, సూట్ వేసుకొని రావాలని చెబుతోందని ఆరోపించారు. ఇది పట్టిసీమ టెక్నాలజీ అనుకోవచ్చునని చెప్పారు.

అసలు వీటన్నింటి వెనుక పెద్ద కథ ఉందన్నారు. దీనిని ప్రశ్నిస్తే రాజధాని కోసమని చెబుతున్నారని మండిపడ్డారు. ఏమైనా అంటే లోటు బడ్జెట్ అంటారని, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు. ప్రాధాన్యతా క్రమంలో ఎందుకు ముందుకు పోవడం లేదని ప్రశ్నించారు.

వీటన్నింటిని గమనిస్తుంటే ఏదో జరుగుతోందని అర్థమవుతోందన్నారు. ఇదో పెద్ద కుంభకోణంలా కనిపిస్తోందన్నారు. అవసరం లేకపోయినా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టడం విడ్డూరమన్నారు. అతి తక్కువ ధరకు ఇప్పుడు విద్యుత్ దొరుకుతుందని, వాటి కోసం ప్లాంటు పెడితే ఇబ్బంది లేదని, కానీ అంతకంటే ఎక్కువ ఖర్చు చేసేందుకు ప్రాజెక్టులు ఏమిటని ప్రశ్నించారు.

ప్రభుత్వం చేసే తీరు చూస్తుంటే ఏదో జరుగుతోందనే అనుమానం అందరికీ కలుగుతుందన్నారు. ఏపీలో అన్నింటిని చూస్తుంటే ఏదో స్కాంలాగా కనిపిస్తోందన్నారు. కొంతమందికి లబ్ధి కలిగించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

అవినీతిలో నెంబర్ వన్, సీఎంకు 13వ ర్యాంక్

అవినీతిలో ఏపీ నెంబర్ వన్‌లో నిలిచిందన్నారు. ఇది దురదృష్టమన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన ర్యాంకింగులో మన ఏపీ సీఎం చంద్రబాబుకు 13వ ర్యాంకు వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌కు మొదటి ర్యాంకు వచ్చిందని, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రెండో ర్యాంకు, చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్‌కు నాలుగో ర్యాంకు వచ్చిందన్నారు. దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించవద్దన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP raises many doubts on AP government power plant projects.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి