చంద్రబాబు అక్కడకు వెళ్ళింది అందుకేనా? బాబు జంగారెడ్డి గూడెం పర్యటనపై వైసీపీ మంత్రులు ఫైర్!!
జంగారెడ్డిగూడెం మరణాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న వరుస మరణాలతో ఏపీ మద్యం పాలసీ పై ఏపీ అసెంబ్లీ వేదికగా మరోమారు చర్చ జరిగింది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష టీడీపీ నేతలు జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 25 మంది మృతి చెందారని, ఈ హత్యలు ప్రభుత్వ హత్యలే అని ఆరోపణలు గుప్పించారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

జంగారెడ్డి గూడెంలో చంద్రబాబు పర్యటన.. జగన్ సర్కార్ టార్గెట్ గా మండిపాటు
ఇదిలా ఉంటే తాజాగా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న మరణాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెంలో పర్యటించిన చంద్రబాబు జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతుందని, కల్తీ మద్యానికి కేరాఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న మరణాలు ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు బలప్రదర్శనకు వెళ్ళారా ? లేకా పలకరింపుకు వెళ్ళారా? మంత్రి ఆళ్ళ నాని
తాజాగా చంద్రబాబు నాయుడు జంగారెడ్డిగూడెం పర్యటన పై వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బలప్రదర్శనకు వెళ్లారా లేక పలకరించడానికి వెళ్లారా చెప్పాలంటూ ఏపి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రశ్నించారు. పత్రికల్లో వార్తలు వచ్చిన వెంటనే అక్కడి మెడికల్ క్యాంపులు పెట్టమని సీఎం చెప్పారని, అంత మంది మరణాలకు సంబంధించిన కారణాలపై సర్వే కూడా చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. అక్కడ సాధారణ మరణాలను కూడా టిడిపి కల్తీ మద్యం మరణాలు గా చిత్రీకరిస్తుందని మంత్రి ఆళ్ల నాని ఆరోపించారు.

జంగారెడ్డి గూడెం ఘటనపై చంద్రబాబు ఆయన కోటరీ దుష్ప్రచారం : మంత్రి బొత్సా
మరోవైపు జంగారెడ్డిగూడెం ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ అంశంపై చంద్రబాబు ఆయన కోటరీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీసారా అయితే మూకుమ్మడిగా చనిపోతారని, జంగారెడ్డిగూడెంలో అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని కావాలని ప్రతి దానిని రాజకీయం చేయడం టిడిపి మానుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై ప్రభుత్వం సభలో ప్రకటన చేస్తుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కావాలని కల్తీసారా మరణాలపై ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.












Click it and Unblock the Notifications