"ఆ మాట బట్టి చెప్పొచ్చు.. పవన్ ఎంత పిరికివాడో!, సైడ్ ఆర్టిస్ట్ లను తిట్టేస్తే హీరో అనిపించుకోరు"
హైదరాబాద్: ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పెట్టిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలుపుతుంటే.. వద్దని ఎందుకు చెప్పలేదని, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ల వల్లే ప్రజారాజ్యానికి ఆ గతి పట్టిందని పవన్ కళ్యాణ్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.
పవన్ చేసిన ఈ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పరకాల ప్రభాకర్ లాంటి సైడ్ ఆర్టిస్ట్ లను తిట్టేస్తే పవన్ హీరో అనిపించుకోరని విమర్శించారు. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్లను పట్టుకుని 'వదలను' అని అనడంతో పవన్ ఎంత పిరికివాడో, ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోందని అన్నారు.

పవన్ కళ్యాణ్ ముందుగా, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు, మాఫియాపై పోరాడి, ఆ తర్వాత ప్రజల కోసం పోరాడాలని సూచించారు. 'తనకు భయం లేదు, జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్నారు.. ఆయనే కాదు మేము అందుకు సిద్ధమే' అని అనిల్ అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గురించి అనవసరంగా అవాకులు చెవాకులు పేలడం మంచి పద్ధతి కాదని పవన్ కు అనిల్ సూచించారు. ఇకనైనా అటువంటి వ్యాఖ్యల జోలికి పోకుండా ఉంటే మంచిదని అన్నారు.
కాగా, చిరంజీవిని తిట్టి మరీ పరకాల ప్రభాకర్ పార్టీని వీడారని, అన్నయ్య నోరు లేనివారు కాబట్టే ఏమి అనలేకపోయారని కూడా పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి స్థానంలో తానుంటే సందర్భం మరోలా ఉండేదన్నారు.












Click it and Unblock the Notifications