జనసేనలో చేరిన వైసీపీ బలిజ ఎమ్మెల్యే- అందుకే పార్టీని వీడానని వెల్లడి..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఏకమైన టీడీపీ-జనసేన పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్తున్న వేళ కాపు, బలిజ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. విపక్షాల పొత్తుతో వైసీపీలో ఉండి తిరిగి గెలవడం అసాధ్యమని భావిస్తున్న వారు కొందరైతే, వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీట్లు కోల్పోయిన వారు మరికొందరు ఇప్పుడు జనసేనలో చేరుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీలో ఏకైక బలిజ సామాజిక వర్గ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఇవాళ జనసేనలో చేరారు.

తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న అరణి శ్రీనివాసులును వైసీపీ అభ్యర్ధిగా సీఎం జగన్ ఎంపిక చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ సీటు మరొకరికి కేటాయించారు. అదే సమయంలో చిత్తూరు నుంచి వైసీపీ ఇన్ ఛార్జ్ గా మరొకరికి అవకాశం ఇచ్చేశారు. దీంతో అసంతృప్తికి గురైన అరణి శ్రీనివాసులు తాజాగా పవన్ కళ్యాణ్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ విషయం తెలియగానే వైసీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
దీంతో అరణి శ్రీనివాసులు ఇవాళ అధికారికంగా జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నేతలతో కలిసి ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ఈ సందర్భంగా అరణి శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తనకు ఎన్నో అవమానాలు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు. తాను వైసీపీ బాధితుడిని అన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేను అయిన తనను వైసీపీ అవమానించిందన్నారు. పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి జనసేనలో చేరానన్నారు.
అందరికీ అరణి శ్రీనివాసులుగా తెలిసిన జంగాల శ్రీనివాసులు తనకు 2008 నుంచే తెలుసని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన ఆయన.. జనసేనలోకి రావడం సొంతింటికి వచ్చినట్లేనన్నారు. జంగాల వంటి ప్రజల కోసం పనిచేసే నాయకులకు జనసేన అండగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications