
చెదిరిందయ్యా చంద్రం: కొండపైన అమ్మవారు..కింద కమ్మవారు కాదు: పవన్ కొత్త బిజినెస్: వైసీపీ
అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రభంజనం.. ఆ పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా విజయాలను అందుకుని జోరు మీదున్న వైసీపీ నేతలు తాజాగా పట్టణ స్థానిక సంస్థల్లో నమోదు చేసిన గెలుపును ఎంజాయ్ చేస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద బాణాసంచా కాలుస్తున్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు. గెలిచిన అభ్యర్థులను ఘనంగా సన్మానిస్తోన్నారు. పనిలో పనిగా తెలుగుదేశం, జనసేన పార్టీలను లక్ష్యంగా చేసుకుని సెటైర్లను సంధిస్తున్నారు.
Recommended Video


గుంటూరోళ్ల సత్తా ఇదీ..
మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు గుంటూరులో చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. రోషం.. పౌరుషం ఉన్న సగటు గుంటూరు ఓటరు చంద్రబాబుకు గుణపాఠం చెప్పారని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
గుంటూరు ఓటరు పౌరుషం ఎలాంటిదో చంద్రబాబుకు ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుందని చెప్పారు. గుంటూరులో అడుగు పెట్టే అర్హతను చంద్రబాబు కోల్పోయారని అన్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఇదే జిల్లా మంగళగిరిలో పోటీ చేసి ఘోరంగా పరాజయం పాలయ్యారని గుర్తు చేశారు. ప్రజలను తిడుతూ ఓట్లు అడిగే సరికొత్త సంప్రదాయానికి చంద్రబాబు తెరతీశారని, దాన్ని ఓటర్లు మొగ్గలోనే తుంచేశారని చురకలు అంటించారు. చెదిరిందయ్యా చంద్రం అంటూ ఎద్దేవా చేశారు.

రాజకీయాలంటే మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కాదు..
రాజకీయాలు చేయడం, రాజకీయ పార్టీని నెలకొల్పడమంటే మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కాదని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు కానీ.. రాజకీయాల్లో అలా కుదరదని అన్నారు. విలువలు, సిద్ధాంతాలు ఉంటాయని గుర్తు చేశారు. మొన్నటిదాకా కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని, పవన్ కల్యాణ్ వారిని మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

ఒకటే జెండా.. అజెండా
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. విశాఖ ఎన్నికలు, మూడు రాజధానులకు రెఫరెండంగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడేమంటారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకటే జెండా.. అజెండా మిగిలాయని గుర్తు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీకి ప్రజలు గుణపాఠం చెప్పారని రోజా వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయించారని రోజా అన్నారు. తనతో పాటు ఎంపీ నందిగాం సురేష్‌పై దాడులు చేయించారని చెప్పారు. రాజధానికి అన్యాయం చేసింది చంద్రబాబే తప్ప జగన్ కాదని అన్నారు.

పైన అమ్మవారు.. కింద అన్నగారు..
విజయవాడలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన రాజకీయాలకు చెల్లుచీటి పడిందని రోజా అన్నారు. పైన అమ్మవారు.. కింద కమ్మవారు అనే నినాదం ఇక వినిపించదని, దాని స్థానంలో పైన అమ్మవారు.. కింద అన్నగారు ఉంటుందని చెప్పారు. కులాలు, మతాలు ప్రాంతాలకు అతీతంగా జగన్ పాలన సాగుతోందని, అందుకే తమకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. వైజాగ్, విజయవాడ, గుంటూరుల్లో విజయం సాధించడమే దీనికి నిదర్శనమని చెప్పారు.

నమ్ముకున్న వారితో బిజినెస్..
తనను నమ్ముకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పవన్ కల్యాణ్ బిజినెస్ చేస్తున్నారని రోజా అన్నారు. దౌర్జన్యాలతో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించారని పవన్ కల్యాణ్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. దౌర్జన్యాలు చేసి ఉంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. జనసేనను నమ్ముకున్న వారిని పవన్ కల్యాణ్ ఘోరంగా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు, విజయవాడలో టీడీపీకి, తిరుపతిలో బీజేపీకి ఓటు వేయమంటున్నారని, ప్యాకేజీల ప్రకారం.. ఎప్పుడు ఏ పార్టీకి ఓటు వేయమంటాడో ఆయనకే తెలియదని అన్నారు.