హిందూపురం సీటు దక్కకపోవడంపై ఇక్బాల్ రియాక్షన్ ఇదే..! మరో సీటుపై కన్ను ?
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ఓసారి పోటీ చేసి ఓడిపోయిన మొహమ్మద్ ఇక్బాల్.. మరోసారి తనకే సీటు వస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ నే తాను నమ్ముకున్నానని, మరోసారి కచ్చితంగా సీటు వస్తుందని ఆశించారు. కానీ ఆయన అంచనాల్ని తారుమారు చేస్తూ సీఎం జగన్ టీఎన్ దీపికను అక్కడ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. దీంతో ఇక్బాల్ కు నిరాశ తప్పలేదు.
టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై పోటీకి సరైన అభ్యర్ధిని ఎంచుకోకపోతే మరోసారి ఎదురుదెబ్బ తప్పదని భావించిన జగన్.. తాజాగా నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఇక్బాల్ కు పిలుపు అందలేదు. దీంతో ఇక్బాల్ కు ఈసారి అవకాశం లేదని తేలిపోయింది. ఇక్బాల్ కు బదులుగా ఈ సమీక్షలో పాల్గొన్నస్ధానిక మహిళా నేత టీఎన్ దీపికపై అందరి దృష్టీ పడింది. తాజాగా అధికారికంగానే ఆమె పేరును ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. దీనిపై ఇక్బాల్ స్పందించారు.

వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఇక్బాల్.. దాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం దీపిక హిందూపురంలో ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపడతారని, తాను కొంతకాలం హైదరాబాద్ లో వ్యక్తిగత పనుల కోసం వెళుతున్నట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ నియోజకవర్గానికి తిరిగొస్తానని అభిమానులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి నిరాశకు గురికావొద్దని వారిని కోరారు. హిందూపురంతో తన బంధం కొనసాగుతుందన్నారు.
మరోవైపు హిందూపురంలో సీటు దక్కకపోవడంతో నిరాశకు గురైన ఎమ్మెల్సీ ఇక్బాల్ ఇప్పుడు మరో సీటుపై కన్నేశారు. గతంలో టీడీపీ నుంచి ముస్లిం అభ్యర్ధి అత్తార్ చాంద్ భాషా గెలిచిన కదిరి సీటుపై ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ సీటులో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డి ఉన్నారు. ఆయన స్ధానంలో తనకు సీటు కేటాయించాలని ఇక్బాల్ సీఎం జగన్ ను కోరే అవకాశం ఉంది. దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications