కుల గణనపై జగన్ కు కృష్ణయ్య థ్యాంక్స్-అందరూ మద్దతివ్వాలన్న వైసీపీ ఎంపీ...
ఏపీలో త్వరలో ప్రారంభం కాబోతున్న కులాల సర్వేపై వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రసంశల జల్లు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదవర్గాల సంక్షేమం కులగణన కార్యక్రమంతో ముడిపడి ఉందని ఆయన తెలిపారు. జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు జగన్ బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పేదవర్గాల మేలుకు కులగణన అనేది కీలకం కానుందన్నారు.
ఈ విషయంలో సీఎంగారు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం చూసి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఆశ్చర్యపోతున్నారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా బీసీ వర్గానికి చెందిన వారే కానీ, తాము బీసీ ప్రభుత్వాలు నడుపుతున్నామని చెప్పుకునే వారు కానీ బీసీ కులగణన జరిపేందుకు ముందుకు రాని పరిస్థితిని చూస్తున్నామన్నారు. 100 ఏళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న కులగణన ఒక్క బీసీలకే కాకుండా మిగతా కులాల వారికి కూడా మేలు చేయనుందన్నారు.

బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బీసీలకు నిజంగా బ్యాక్ బోన్‌గా నిలిచారని ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు. కులాల లెక్కలు తీయక ముందే రాష్ట్రంలో ఇప్పటివరకూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. కులం, మతం, వర్గం, రాజకీయం, ప్రాంతీయ బేధాల్లేకుండా నవరత్నాల పథకాలు అందుతున్నాయన్నారు. 'కులగణన' అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమమని, రాష్ట్రంలో సీఎం జగన్ చేపట్టిన మహత్తర సంకల్పంగా దీన్ని చెప్పవచ్చన్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇది ఆదర్శమైన కార్యక్రమం అన్నారు.
బీసీ కులగణన అనేది వందేళ్ల క్రితం జరిగిందని,కులగణన కోసం బీసీలందరూ కలలుగన్నారని కృష్ణయ్య తెలిపారు. కులగణన కోసం ఎప్పటి నుంచో చాలా మంది డిమాండ్ చేస్తున్నారని, ఇన్నాళ్లకు జగన్ దయ వల్ల రాష్ట్రంలో బీసీ కులగణన జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమం గిట్టని కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ నేతల మాయమాటల్ని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నిజానికి పార్లమెంట్‌లో ప్రతి బీసీ ఎంపీ కూడా కులగణనను కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులగణనకు అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరముందన్నారు.












Click it and Unblock the Notifications