కేంద్రం ప్రకటనతో వైసీపీకి భారీ అస్త్రం-విపక్షాలతో సాయిరెడ్డి చెడుగుడు...!
ఏపీలో గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఓ ఆరోపణకు కేంద్రం పార్లమెంటులో ఒక్క సమాధానంతో చెక్ పెట్టింది. గత టీడీపీ ప్రభుత్వంతో పోలుస్తూ వైసీపీ సర్కార్ పై నిత్యం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ కేంద్రం సమాధానంతో మూలనపడిపోయాయి. ఈ నేపథ్యంలో వైసీపీలోనూ జోష్ కనిపిస్తోంది. ఇదే అదనుగా ఎన్నికల వేళ విపక్షాలపై ఎదురుదాడిని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతోంది.
ఏపీలో నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం భారీగా అప్పులు చేస్తోందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇన్నాళ్లూ మీరూ చేశారుగా అప్పులు అంటూ ఓసారి, కేంద్రం కూడా అప్పులు చేస్తోందని మరోసారి చెప్పుకుంటూ వస్తున్న వైసీపీ సర్కార్ కు స్వయంగా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. అసలు ఏపీ అప్పులు ఎంత అంటూ రాజ్యసభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఏపీలో అప్పులపై క్లారిటీ ఇచ్చేసింది.

ఏపీలో 2019 నాటికి రూ.2,64,451 కోట్ల అప్పులు ఉన్నట్లు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో ప్రకటించారు. అలాగే 2023 నాటికి ఈ అప్పు రూ.4,42,442 కోట్లకు చేరుకుందన్నారు. అంటే వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు కేవలం రూ.1,77,991 కోట్లు మాత్రమేనని తేల్చేశారు. తద్వారా వైసీపీకి ఎన్నికల వేళ భారీ ఊరటనిచ్చారు. ఇప్పుడు అదే ప్రకటనను ప్రస్తావిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపక్షాలపై ట్వీట్ పెట్టారు.
ఇందులో విజయసాయిరెడ్డి.. రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ర్పచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్ధికమంత్రి చెప్పిన సమాధానం చూసైనా పరివర్తన తెచ్చుకోవాలంటూ ట్వీట్ చేశారు. అలాగే 2019 నాటికి ఉన్న అప్పు, ఇప్పుడు 2023 నాటికి వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పును కేంద్ర ఆర్ధికమంత్రి చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ.1,77,991 కోట్లు మాత్రమేనని సాయిరెడ్డి వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం ఈ అప్పు చేశామని, దీన్ని రూ.10 లక్షల కోట్లు అంటూ ప్రచారం చేయడం దుర్మార్గం కాదా అని సాయిరెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications