జీరో ప్లస్ జీరో ఈక్వల్స్ జీరో- ఆడిటర్ సాయిరెడ్డి లెక్క ఇదే...!
ఏపీలో అధికార వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలంటే లక్ష్యంతో విపక్షాలు ఏకమవుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని కలిపి పొత్తులు కుదిర్చేందుకు సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ మాత్రం ఒంటరి పోరునే నమ్ముకుంటోంది. విపక్షాల పొత్తులతో తమకు నష్టం లేదనే భావన వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విపక్షాల పొత్తులతో ఏం జరుగుతోంది చెప్పేశారు.

ఏపీలో పొత్తుల కోసం విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపై స్పందిస్తూ ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండు ట్వీట్లు పెట్టారు. ఇందులో తొలి ట్వీట్లో వైసీపీకి పొత్తులు అక్కర్లేదని సాయిరెడ్డి తెలిపారు. అలాగే ప్రజల కోసం తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని, ప్రజలు తమను మరోసారి ఆశీర్వదిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విపక్షాలు పొత్తులతో కలిసి వచ్చినా వచ్చిన ఇబ్బందేమీ లేదని సాయిరెడ్డి తెలిపారు.

అలాగే విపక్షాల పొత్తు వ్యూహాలను లెక్కలతో పోలుస్తూ సాయిరెడ్డి తన ట్వీట్ లో ఓ వ్యాఖ్య కూడా చేశారు. జీరో ప్లస్ జీరో కలిపితే జీరోనే అవుతుందంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తుండటం, అమిత్ షా-చంద్రబాబు భేటీ తర్వాత రాష్ట్రానికి వచ్చి ఆయన వైసీపీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు, తాజాగా పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో సాయిరెడ్డి ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరో ట్వీట్ లో సాయిరెడ్డి...కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము - ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. విపక్ష నాయకులు తాము ఫలానా కులానికి చెందినవారమని...కాబట్టి ఆ కులం వారంతా గంపగుత్తగా తమకే ఓటు వేయాలని మైకులు పట్టుకొని మీద పడుతున్నారు. YSRCP మాత్రం కులం, మతం, వర్గం, పార్టీ, ప్రాంతం చూడదు...అందరినీ సమంగా ఆదరిస్తుంది. అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications