ఎన్నికల వేళ.. మోదీకి సాయిరెడ్డి కీలక ప్రతిపాదన
PM Kisan: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం క్రమంగా నెలకొంటోంది. ఇంకొద్దిరోజుల్లో ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చి రెండో వారం నాటికి లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయం.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికల అజెండాపై చర్చించడానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తోంది కూడా.

ఈ పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనను పంపించింది. పీఎం కిసాన్ కింద దేశవ్యాప్తంగా రైతులకు అందజేస్తోన్న ఆర్థిక సహాయం మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేసింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉత్తరాదిన రైతులు ఉద్యమిస్తోన్న నేపథ్యంలో వైసీపీ ఈ విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది.
పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం 6,500 రూపాయలను అందజేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత.. అంటే 2019లో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది బీజేపీ.
పీఎం కిసాన్ మొత్తాన్ని 6,500 నుంచి 10,000 రూపాయలకు పెంచాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయి రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 2019లో ఈ పథకం అమల్లోకి వచ్చిందని, అప్పటి నుంచి అదే సాయం కొనసాగుతోందని, దీన్ని ఎప్పుడూ పునఃసమీక్షించలేదని గుర్తు చేశారు.
ఈ అయిదు సంవత్సరాల వ్యవధిలో పంట ఖర్చులు భారీగా పెరిగాయని సాయిరెడ్డి అన్నారు. 2019 నుంచి కేంద్ర వార్షిక బడ్జెట్ సుమారు 74 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. అయినప్పటికీ- పీఎం కిసాన్ పథకంలో ఆ స్థాయిలో పెరుగుదల కనిపించలేదని అన్నారు. ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచాలని కోరారు.












Click it and Unblock the Notifications