వరద నష్టం రూ.6,054 కోట్లు: ఏపీకి తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు: రాజ్యసభలో వైసీపీ ఎంపీ
న్యూఢిల్లీ/అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు రాష్ట్రాన్ని అతలకుతలం చేశాయి. వరదలతో ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని విధంగా రాయలసీమలో రోజుల తరబడి భారీ వర్షాలు కురిశాయి. వరదముంపునకు గురి చేశాయి. రాయలసీమలో ప్రవహించే పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, చెయ్యేరు.. ఇలా అన్ని నదులూ ఉప్పొంగాయి. తీర ప్రాంతాలను ముంచివేశాయి. ఏపీ దక్షిణ తీర ప్రాంతంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థిితులు ఏర్పడ్డాయి.

వరదముంపులో..
వరదపోటునకు కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగడం.. నష్టం తీవ్రతను మరింత పెంచింది. ఈ ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలు మునిగిపోయాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. రోజుల తరబడి కొండల మీద కాలం వెల్లదీసే దుస్థితిని ఎదుర్కొన్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈ రెండు జిల్లాల్లో పలు పాత భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.

తిరుపతిపై తీవ్ర ప్రభావం..
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలతో పాటు టెంపుల్ సిటీ తిరుపతి ఇప్పటికీ తేరుకోలేకపోతోంది. లోతట్టు ప్రాంతాలు ముంపులోనే కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయ, పునరావాస చర్యలకూ ఆటంకం కలుగుతోంది. దశాబ్దాల తరువాత రాయలచెరువు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. పూర్తిగా నిండిపోయింది. తెగే ప్రమాదాన్ని ఎదుర్కొంది. స్థానిక అధికారులు యుద్ధ ప్రాతిపదకన రాయల చెరువు కట్ట లీకులను అరికట్టగలిగారు.

తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు..
ఈ పరిస్థితులన్నింటినీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి.. రాజ్యసభలో ప్రస్తావించారు. తక్షణ సాయం కింద 1,000 కోట్ల రూపాయలను విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ఆయనకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. దీనితో సాయిరెడ్డి వరద పోటు తీవ్రతను ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.
నాలుగు జిల్లాల్లో అపార నష్టం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అనూహ్యంగా వరదలు సంభవించాయని పేర్కొన్నారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల రిజర్వాయర్లు బీటలు వారాయని చెప్పారు. చెరువులు తెగాయని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలను వరదనీరు ముంచెత్తిందని అన్నారు. రోడ్లు, వంతెనలు, రైల్వే పట్టాలు ధ్వంసం అయ్యాయని, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని చెప్పారు.

70 వేల మంది నిరాశ్రయులు..
వేలాది నివాసాలను వరద నీరు ముంచెత్తిందని, పలు ఇళ్లు కొట్టుకుపోయాయని సాయిరెడ్డి చెప్పారు. ఇప్పటిదాకా 44 మంది మరణించినట్లు ఆయన సభకు వివరించారు. మరో 16 మంది గల్లంతయ్యారని అన్నారు. 70 వేలమంది నిరాశ్రయులయ్యారని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, లక్షలాది హెక్టార్లలో చేతికి అందిన పంట నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. 1.85 లక్షల హెక్టార్లలో సాధారణ పంటలు, ఉద్యానవనాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు.

నష్టం అంచనా.. రూ.6,054 కోట్లు..
ప్రాథమిక అంచనాల ప్రకారం- 6,054 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి సంకట పరిస్థితుల్ల రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తక్షణ సహాయం కింద 1,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన కోరారు. తక్షణ సహాయాన్ని అందించాలని ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను విజ్ఞప్తి చేశారు. కేంద్రం కేటాయించే నిధులు వెసలుబాటును కల్పిస్తాయని అన్నారు.












Click it and Unblock the Notifications