వైఎస్ జయంతి స్పెషల్-రేపు కుప్పానికి 175 కార్లతో వైసీపీ భారీ ర్యాలీ-బైరెడ్డి కామెంట్స్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విపక్షాలపై పైచేయి సాధించేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉన్న అధికార పార్టీ.. రేపు మాజీ సీఎం దివంగత వైఎస్సార్ జయంతిని ఇందుకోసం వాడుకోవాలని నిర్ణయించింది.
వైసీపీ 2019లో సాధించిన విజయం వెనుక బెంగళూరు సిలికాన్ వ్యాలీకి చెందిన పలువురు యువ ఐటీ ఉద్యోగులు, సోషల్ మీడియా టీమ్ ల పాత్ర ఎంతో ఉంది. గతంలో 2019 ఎన్నికల సమయంలో వారంతా రావాలి జగన్-కావాలి జగన్ పేరుతో యాత్రలు నిర్వహించారు. ఐటీ ఉద్యోగులకు దొరికే వారాంతపు సెలవుల్లో తమ సొంత ఊర్లకు వెళ్లి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వీరికి అలవాటే. ఈసారి విన్నూత్నంగా వారు మరో కార్యక్రమం చేపట్టారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా రేపు అంటే శనివారం బెంగళూరు నుంచి చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి భారీ కార్ల ర్యాలీ నిర్వహించాని వారు నిర్ణయించారు. ఇందులో భాగంగా 175 కార్లతో బెంగళూరు నుంచి బయలుదేరి కుప్పానికి వచ్చి అక్కడ వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. వీటిని శాప్ ఛైర్మన్, వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ఢ్ రెడ్డి పర్యవేక్షించబోతున్నారు.
గతంలో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఐటీ నిఫుణులు, సోషల్ మీడియా టీమ్ లు మరోసారి కార్ల ర్యాలీలో కుప్పానికి రావాలని ప్లాన్ చేసినట్లు బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. గతంలో చేసిన తరహాలోనే భారీ ఎత్తున ప్రజల్లోకి వైసీపీ కార్యక్రమాల్ని తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్ల ర్యాలీ ఏర్పాటు చేసినట్లు బైరెడ్డి తెలిపారు. కాబట్టి ఇందులో మిగతా వారు కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరుతున్నారు.












Click it and Unblock the Notifications