జగన్‌కు కలిసి రాని రాజకీయం: ముందే పవన్ కళ్యాణ్, రాహుల్ గాంధీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూసుకుపోవాలని భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాలం కలిసి రావడం లేదు. ఆయన రాజకీయాలకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రత్యేక హోదా, రాజధానికి భూసేకరణ అంశాలపై ఆందోళనకు శ్రీకారం చుట్టి రాజకీయంగా బలపడాలనే ఆయన ప్రయత్నాలకు గండి పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది. జగన్ స్వయంగా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. అయితే, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా కోసం పోరాడతానని ప్రకటించిన తర్వాతే ఈ అంశంపై జగన్ స్పందించారనే ప్రచారం ఊపందుకుంది.

ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ నిలదీసిన తర్వాత ఆయన కదిలినట్లు భావిస్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నానని చెప్పిన జగన్ ప్రధాని నరేంద్ర మోడీని పల్లెత్తు మాట అనకపోవడం కూడా ఆయనకు వ్యతిరేకంగానే పనిచేసింది. ప్రత్యేక హోదా విషయంలో జగన్‌కంటే కాంగ్రెస్ పార్టీయే దూకుడుగా ఉందనే అభిప్రాయం బలవడింది.
రాజధానికి భూసేకరణ విషయంలోనూ జగన్ వెనకబడిపోవాల్సి వచ్చింది. సేకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 26న ధర్నా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, జగన్ కన్నా ముందే ఆదివారమే పవన్ కల్యాణ్ పర్యటించారు. రైతులతో చర్చించారు. జగన్ ముహూర్తాలు చూసుకుని ఆందోళన కార్యక్రమాలకు పూనుకునే లోపల ఇతర పార్టీల నాయకులు దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications