బడ్జెట్ పై పెదవి విరిచిన వైసీపీ ! పార్లమెంట్లో నిలదీస్తామన్న ఎంపీలు-బుగ్గన రియాక్షన్ ఇదే !
నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై వైసీపీ పెదవి విరిచింది. పదేళ్లైనా విభజన హామీలు అమలుకాలేదని ఎంపీలు నిరాశ వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చిన బడ్జెట్ పై వైసీపీ ఎంపీలు స్పందించారు. బడ్డెట్ పేలవంగా ఉందన్నారు.ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు విభజనచట్టంలోని హామీల అమలు విషయంలో నిరాశే మిగిలిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రధాని సమక్షంలో, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విభజన చట్టం హామీలను ప్రస్తావించారని, విభజన చట్టం బిల్లు పార్లమెంటులో ఆమోదించి ఇప్పటికి పదేళ్లయినా, ఆ హామీల ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. పోలవరం నిధులు ఊసూ లేదన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనా లేదన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించే నిధుల విషయంలోనూ ప్రగతి లేదని మిథున్ రెడ్డి ఆరోపించారు. అలాగే రైల్వే కారిడార్, స్టీల్ ప్లాంట్‌కు చేస్తామన్న సాయం గురించి ప్రస్తావనలు లేనేలేవని విమర్శించారు. వీటన్నిటిపైనా కేంద్రాన్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తామని మిథున్ రెడ్డి తెలిపారు.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల మంజూరు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. మధ్యతరగతి, మహిళలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారని, అయితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి ఏమీ లేవన్నారు. ఆరోగ్య పరంగా ప్రతిజిల్లాకు వైద్య కళాశాలలు రావాల్సి ఉందన్నారు. సీఎం రాష్ట్రానికి కొత్తగా 18 వైద్య కళాశాలలను తెస్తున్నారని, వీటిలో కేంద్రం కేవలం మూడు కాలేజీలకు మాత్రమే నిధులిస్తామని చెప్పిందన్నారు. మిగిలిన వాటికీ నిధులివ్వాలని అడుగుతున్నామని భరత్ వెల్లడించారు. రైల్వే పరంగా విశాఖపట్నం-విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి ఉందన్నారు. ఇదే కాకుండా కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉందని, ఈ లైను వేయడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు 70 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. దీనివల్ల ఖర్చులు తగ్గించుకునే అవకాశముందన్నారు.

కేంద్రం ఇవాళ తీసుకొచ్చిన బడ్జెట్ పై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రం సానుకూలంగా స్పందించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన సలహాలు,సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరామని, ఈ రంగంలో ఏపీ రోల్ మోడల్‌గా ఉన్నందున, దీనిపై పాలసీ కోరామని కేంద్రం దీన్ని ఆమోదించిందన్నారు. పీఎం ఆవాస్ యోజన నిధులు పెంచాలన్న ఏపీ విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించి నిధులు పెంచారని బుగ్గన తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ తరహాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఏపీ ప్రతిపాదనను పరిగణించి అర్బన్ ఇన్ ఫ్రా డెవలప్ ఫండ్ దేశ వ్యాప్తంగా ప్రారంభం కావడం గర్వకారణమన్నారు. ఈ బడ్జెట్‌లో మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయని బుగ్గన తెలిపారు. నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు నిర్మాణానికి ఉపయోగకరమన్నారు. గృహ నిర్మాణం, ఏకలవ్య స్కూళ్ల అభివృద్ధికి బడ్జెట్ తోడ్పాటు లభించిందన్నారు. వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications