పక్క రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్: ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా రకం: తొలి పాజిటివ్ కేసు
బెంగళూరు: కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు 10 వేలకు దిగువగా నమోదయ్యే కేసులు.. ఇప్పుడు 20 వేలకు చేరువగా వెళ్తున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్రలో భయానకంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. వేల సంఖ్యలో రోజువారీ కేసులు రికార్డవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలపైనా దాని ప్రభావం పడింది. ఏపీలో యాక్టివ్ కేసులు పైకి ఎగబాకుతున్నాయి. వెయ్యి మార్క్‌ను దాటాయి. తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

దక్షిణాఫ్రికా వేరియంట్..
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రోజువారీ బులెటిన్‌లను జారీ చేయడాన్ని పునఃప్రారంభించింది. ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ అది. కొత్త స్ట్రెయిన్ కేసు నమోదు కావడం కర్ణాటకలో ఇదే తొలిసారి. ఇప్పటిదాకా కర్ణాటకలో 29 బ్రిటన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ జిల్లాకు చెందిన వ్యక్తిలో కరోనా దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి.

బ్రిటన్ నుంచి బెంగళూరుకు చేరుకున్న వ్యక్తిలో..
ఆ వ్యక్తి ఇటీవలే బ్రిటన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. కరోనా ప్రొటోకాల్ ప్రకారం.. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఆ నమూనాలను మరింత లోతుగా పరీక్షించారు. వైరస్ జెనెటిక్ సీక్వెన్స్ ఆధారంగా అతనికి సోకింది దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌గా నిర్ధారించారు. వెంటనే ఆ వ్యక్తిని తొలుత సంస్థాగత క్వారంటైన్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

యూకే స్ట్రెయిన్ ప్రభావం ఎక్కువే..
కరోనా వైరస్ దక్షిణాఫ్రికాయ వేరియంట్‌ను గత ఏడాది డిసెంబర్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. అంతకుముందే- బ్రిటన్ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ స్ట్రెయిన్ వల్ల యూకే సహా కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చింది. విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. అప్పట్లో యూకే నుంచి కర్ణాటకకు వచ్చిన వారిలో 29 మందిలో బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. తాజాగా దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కూడా ఎంట్రీ ఇచ్చినట్టయింది.

పెరుగుతోన్న పాజిటివ్ కేసులు..
కాగా- కర్ణాటకలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం నాటి బులెటిన్ ప్రకారం.. 24 గంటల్లో కొత్తగా 760 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 488 ఒక్క బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో కరోనా కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతోందనడానికి ఉదాహరణగా నిలిచాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు 9,56,801కి చేరుకున్నాయి. ఇందులో 9,36,947 మంది డిశ్చార్జ్ అయ్యారు. 12,379 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 7,456గా నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications