Drug mafia: హీరోయిన్లకు బెయిల్ ఇవ్వండి, బాంబులతో పేల్చేస్తాం, కోర్టుకు డిటోనేటర్లు పార్శిల్ ? !
బెంగళూరు/ బేలూరు/ తుమకూరు: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయ్యి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు బెయిల్ ఇచ్చి విడుదల చెయ్యకపోతే బాంబుతో పేల్చేస్తామని కోర్టుకు, జడ్జికి బెదిరింపు లేఖలు పంపించడం కలకలం రేపింది. కవర్ లో బాంబు ఉంది జాగ్రత్త ?, వెంటనే రాగిణి, సంజనాలకు బెయిల్ ఇవ్వండి, లేదంటే బాంబులతో పేల్చేస్తాం అంటూ ఓ పార్శిల్ లేఖ పంపించారు. బెంగళూరు కోర్టుకు పంపించిన పార్శిల్ కవర్ లో డిటోనేటర్ ఉండటంతో కలకలం రేపింది. కవర్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ ముమ్మరం చేసి నిందితులకు బాహుబలి కంటే పెద్ద సినిమా చూపించడానికి సిద్దం అవుతున్నారు.
Illegal affair: భర్త ఎగ్ రైస్ వ్యాపారి, గుడ్డు పక్కింట్లో పెడుతున్నాడని రాగిముద్దతో చంపేసిన భార్య!

డ్రగ్స్ కేసులో ముద్దుగుమ్మలకు నో బెయిల్
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను అరెస్టు చేసి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. రాగిణి, సంజనాలకు బెయిల్ ఇవ్వడానికి బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఇప్పటికే నటి సంజనా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

బెంగళూరు కోర్టుకు బెదిరింపు లెటర్
బెంగళూరులో సిటీ సివిల్ కోర్టులోని CCH 36వ కోర్టుకు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కర్ణాటకలోని తుమకూరు జిల్లా నుంచి ఓ పార్శిల్ కవర్ పోస్టులో వచ్చింది. నటి రాగిణి, నటి సంజనాలు అమాయకులు, వాళ్లు ఏ తప్పు చెయ్యలేదు, అనవసరంగా ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు, వెంటనే వారిద్దరికి బెయిల్ ఇవ్వండి, లేదా బెయిల్ రావడానికి సహకరించండి, ఈ కవర్ లో బాంబు ఉంది జాగ్రత్త ? అంటూ న్యాయమూర్తి జస్టిస్ సీనప్పను బెదిరిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది.

పార్శిల్ లో డిటోనేటర్
గుర్తు తెలియని నిందితులు సిటీ సివిల్ కోర్టులోని 36వ సీసీహెచ్ న్యాయస్థానాన్ని బెదరిస్తూ పంపించిన లేఖలో డిటోనేటర్ ఉండటంతో న్యాయమూర్తి సీనప్పతో పాటు కోర్టు ఆవరణంలో ఉన్న న్యాయవాదులు ఆందోళనకు గురై సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్య దళం సిబ్బంది బెంగళూరు సిటీ సివిల్ కోర్టు దగ్గరకు పరుగు తీశారు.

డిటోనేటర్ వైర్లు కట్
బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ విభాగం డీసీపీ కేపి. రవికుమార్, బాంబు నిర్వీర్య దళం సిబ్బంది కోర్టుకు వచ్చిన బెదిరింపు లేఖ పార్శిన్ ను పరిశీలించారు. వెంటనే పార్శిల్ కవర్ లోని డిటోనేటర్ కు అమర్చిన వైర్లు కట్ చేశారు. క్వారీలో బండలు పేల్చడానికి ఉపయోగించే డిటోనేటర్లు కోర్టుకు పంపించి బెదిరించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కోర్టు ఆవరణంలో పార్క్ చేసిన అన్ని కార్లను బాంబు నిర్వీర్య దళం సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులకు వార్నింగ్ ?
ఇటీవల నటి రాగిణి, నటి సంజనాల డ్రగ్స్ కేసు విచారణ, బెంగళూరులోని డీజే హళ్ళి, కేజీ హళ్ళి గొడవల కేసుల విచారణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్, బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్, అడిషనల్ పోలీసు కమిషనర్ కేపీ. రవికుమార్ తదితరులను బెదిరిస్తూ ఓ లేఖ పంపించారు. ఈ కేసుల విచారణ నుంచి తప్పుకోవాలని, నిందితులకు బెయిల్ ఇవ్వకపోతే పోలీసు అధికారులు, న్యాయమూర్తుల కార్లను పేల్చివేస్తామని బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది.

లెటర్ ఇక్కడి నుంచి వచ్చింది
పోలీసు అధికారులకు వచ్చిన బెదిరింపు లేఖల్లో ఎలాంటి పార్శిల్ లేదు. అయితే కోర్టుకు పంపించిన బెదిరింపు లేఖలో డిటోనేటర్ ఉండటం కలకలం రేపింది. ఈ రెండు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలుకా బేళూరులోని పోస్టుఆఫీసు (తపాలా కార్యాలయం) నుంచి బెంగళూరు సిటీ సివిల్ కోర్టులోని ప్రత్యేక కోర్టుకు బెదిరింపు లేఖ, డిటోనేటర్ పార్శిల్ వచ్చిందని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

బాహుబలి కంటే పెద్ద సినిమా గ్యారెంటి
ఇప్పటికే బెంగళూరు నుంచి క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు బేళూరు చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. కోర్టుకు బెదిరింపు లేఖ పంపించిన నిందితులు పోలీసుల చేతికి చిక్కితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ? ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. నిందితులకు బాహుబలి కంటే పెద్ద సినిమా చూపించడానికి పోలీసులు సిద్దం అవుతున్నారు. కోర్టును బెదిరిస్తూ లేఖ పంపించిన నిందితులకు స్యాండిల్ వుడ్ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనాలకు ఏమిటి సంబంధం ? అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.