బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు, సౌమ్యా రెడ్డి vs రామమూర్తి, రీకౌంటింగ్ తో షాక్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పూర్తి అయినా బెంగళూరులోని జయనగర నియోజక వర్గంలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అంటూ సాగిన పోరులో కౌంటింగ్ పూర్తి అయిన తరువాత జయనగర సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కేవలం 160 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో బీజేపీ అభ్యర్థి సీకే. రామమూర్తి రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. ఆ సమయంలో సౌమ్యా రెడ్డి, సీకే రామమూర్తిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. చాలా సేపు వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్య వాగ్వివాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తరువాత రీకౌంటింగ్ నిర్వహించడానికి ఎన్నిలక అధికారులు సిద్దం అయ్యారు. పరిస్థితి విషమించడంతో బెంగళూరు అడిషనల్ పోలీసు కమీషనర్ మువ్వా చంద్రశేఖర్, బెంగళూరు సిటీ ఎన్నికల అధికారి జయనగరలోని ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు. పరిస్థితి విషమించడంతో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
అప్పటికే సంఘటనా స్థానికి చేరుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద గొడవ చెయ్యడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, డీకే సురేష్. మాజీ సీఎం సిద్దరామయ్య, బీజేపీ ఎమ్మెల్సీలు, బీజేపీ నాయకులు జయనగర్ చేరుకుని కౌంటింగ్ జరుగుతున్న కాలేజ్ ముందు ఎన్నికల అధికారుల తీరుతో అసహనం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సౌమ్యా రెడ్డి తండ్రి, కర్ణాటక మాజీ మంత్రి రామలింగా రెడ్డి ఎన్నికల అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కౌంటింగ్ విషయంలో తారుమారు అయితే తాము న్యాయపోరాటం చేస్తామని రామలింగా రెడ్డి ఎన్నికల అధికారులకు హెచ్చరించారు. మొత్తం మీద బెంగళూరులోని జయనగర అసెంబ్లీ నియోజక వర్గంలో ఇంకా టెన్షన్ గానే ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో జయనగర్ లోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications