కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు??
కర్ణాటక అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంలో కీలక మార్పులు చేయాలని భారతీయ జనతాపార్టీ అధినాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మార్పులు ఉండబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే బి.సురేష్‌గౌడ సూత్రప్రాయంగా తెలిపారు. ముఖ్యమంత్రి మార్పు సహా అన్ని అంశాలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రిని మారుస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత లేదన్నారు. కానీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా మార్పు జరిగితే అది ఈనెల 15వ తేదీలోపే జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ మార్పులు ఉంటాయని చెప్పారు. 2023లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంతోపాటు 2024లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి అవడం ఖాయమన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంచి పనితీరు కనపరుస్తున్నారని, ఏడాది పదవీ కాలంలో ఆయన ఎన్నో మంచి పనులు చేశారని, అయితే పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామన్నారు.

ఎన్నికలకు కొద్ది నెలల ముందు ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ బీజేపీలో కొనసాగుతోందని, ఆ నిర్ణయం కేంద్ర నాయకత్వం చేతిలో ఉంటుందని సురేష్ గౌడ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లేజ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా అడి మీడియా సృష్టిగా సురేష్ గౌడ అభివర్ణించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల కర్ణాటకలో పర్యటించిన తర్వాతే ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఉన్నతస్థాయిలో మార్పులుంటాయంటూ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications