Yediyurappa : యడియూరప్ప సంచలన నిర్ణయం..? సీఎం పదవికి రాజీనామా చేసే యోచన..?
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు పదవీ గండం పట్టుకుందని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనపై అసమ్మతి స్వరం వినిపిస్తుండటంతో యడియూరప్ప రాజీనామా చేయక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో యడియూరప్ప ఢిల్లీ పర్యటనకు బయలుదేరడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. శుక్రవారం(జులై 16) ప్రధాని మోదీతో భేటీ అయిన యడియూరప్ప రాజీనామా గురించే చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై శనివారం(జులై 17) కేంద్రమంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజీనామాపై జరుగుతున్న ప్రచారాన్ని యడియూరప్ప ఖండించారు. శనివారం(జులై 17) ఢిల్లీలో మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై ప్రశ్నించగా.. 'అలాంటిదేమీ లేదు... అలాంటిదేమీ లేదు...' అని బదులిచ్చారు. ప్రధానితో భేటీలో కర్ణాటక అభివృద్దిపై చర్చించినట్లు తెలిపారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి అశోక్ కూడా ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఒక ముఖ్యమంత్రి ప్రధానిని కలవడం సహజమేనని... ఇందులో ఎటువంటి ఊహాగానాలకు తావు లేదని చెప్పారు. నదీ జలాల అంశంపై చర్చించేందుకే ప్రధానితో భేటీ అయ్యారని తెలిపారు.

కాగా,78 ఏళ్ల యడియూరప్పపై చాలా కాలంగా పార్టీలో అసమ్మతి వ్యక్తమవుతోంది. ఇటీవలే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్ కర్ణాటకలో పర్యటించి ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించారు. ఈ సందర్భంగా చాలామంది ఎమ్మెల్యేలు యడియూరప్పపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాల్లో సీఎం తనయుడి జోక్యం ఎక్కువైందని... ఇది పార్టీకి,ప్రభుత్వానికి మంచిది కాదని వారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వయసు రీత్యా యడియూరప్ప ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేరు కాబట్టి... 2023 అసెంబ్లీ నాటికి కొత్త ముఖ్యమంత్రి అవసరమని అరుణ్ సింగ్‌తో వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అరుణ్ సిగ్ బీజేపీ అధిష్ఠానానికి నివేదించడంతో యడియూరప్పకు ఢిల్లీ పెద్దలు కబురు పెట్టినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని యడియూరప్ప కొట్టిపారేస్తున్నప్పటికీ ఏ క్షణమైనా ఆయన రాజీనామా చేసే అవకాశం లేకపోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు సహకరిస్తానని ఆయన ప్రధానితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఏ క్షణమైనా నాయకత్వ మార్పు జరగవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications