కర్ణాటక సీఎంగా సిద్దూ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు ప్రత్యేక ఆహ్వానం!
బెంగళూరు/చెన్నై: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దేశంలోని వివిద రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులను ఆహ్వానిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న సమయంలో బెంగళూరుకు కాంగ్రెస్ నాయకుల భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సిద్దరామయ్య గురువారం ఫోన్ చేసి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్బంగా శనివారం మీరు బెంగళూరు రావాలని మనవి చేశారని తెలిసింది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే.

తమిళనాడు సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆహ్వానిస్తోందని తెలిసింది. ఎన్ సీపీ అధినేత శరత్ పవార్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. బెంగళూరులో శనివారం సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, సుశీల్ కుమార్ షిండేతో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లోని నాయకులు అందరూ శనివారం బెంగళూరు వస్తున్నారు. సుమారు లక్ష మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు అవుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications