లక్ష పెడితే 5 నిమిషాల్లో రూ. 44 లక్షలు? సెన్సెక్స్‌లో అసలేం జరిగింది?
స్టాక్ మార్కెట్‌లో గురువారం సాయంత్రం ముగింపు సమయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ట్రేడర్లకు మైండ్ బ్లాక్ చేశాయి. సెన్సెక్స్ సూచీలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల పాయింట్ల హెచ్చుతగ్గులు నమోదుకావడంతో వ్యాపారులు తీవ్ర చర్చల్లో మునిగిపోయారు.
అదే సమయంలో ఒక సోషల్ మీడియా యూజర్ పెట్టిన పోస్ట్ మార్కెట్ వర్గాల్లో ఊహించని సంచలనాన్ని సృష్టించింది. గురువారం మధ్యాహ్నం క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ ఆప్షన్స్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, సరిగ్గా ఐదు నిమిషాల్లోనే అది ఏకంగా రూ. 44 లక్షలుగా మారేదని సదరు ట్రేడర్ చేసిన లెక్కలు ఆశ్చర్యానికి గురిచేశాయి.

అసలేం జరిగింది? నిమిషాల్లో వేల పాయింట్ల హెచ్చుతగ్గులు!
గురువారం మంత్లీ ఎక్స్‌పైరీ రోజున మార్కెట్ ముగిసే ముందు నిమిషాల్లో అసలైన డ్రామా నడిచింది.
- సాయంత్రం 3:17 గంటల సమయంలో 77,200 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది
- సాయంత్రం 3:23 గంటలు కల్లా ఏకంగా 2,000 పాయింట్లు పడిపోయి 74,983 పాయింట్లకు చేరుకుంది.
- సాయంత్రం 3:30 గంటలు.. అంటే ఏడు నిమిషాల్లోనే మళ్లీ అంతే వేగంగా 2,000 పాయింట్లు కోలుకుని 76,934 వద్ద ముగిసింది.
సాయంత్రం 3:15 గంటలకు సెన్సెక్స్ పట్ ఆప్షన్‌లో రూ. 1 లక్ష పెట్టి, 3:20 గంటలకు విక్రయించి ఉంటే దాదాపు 44 రెట్ల లాభం వచ్చి ఉండేదని ట్రేడర్ లెక్కగట్టారు.
అయితే ఇది ఊహాజనిత గణాంకమే తప్ప, ప్రత్యక్షంగా ఎవరూ అంత లాభం పొందలేదని స్పష్టమవుతోంది.
భారీ దిగ్గజ షేర్లలోనూ అదే పరిస్థితి!
ఈ ఊగిసలాట కేవలం సెన్సెక్స్ ఇండెక్స్‌కే పరిమితం కాలేదు. మార్కెట్‌లో అత్యంత కీలకమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర కేవలం ఏడు నిమిషాల్లోనే రూ. 1,289 నుంచి రూ. 1,250 కి పడిపోయి, వెంటనే పుంజుకుని రూ. 1,286 వద్ద ముగిసింది.
రిలయన్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ షేర్లలో కూడా ముగింపు సమయంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఇటీవల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రవేశపెట్టిన నూతన 'క్లోజింగ్ ఆక్షన్ సెషన్'విధానం వల్లనే ఈ రకమైన తీవ్ర ఊగిసలాటలు జరుగుతున్నాయని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు.
సెబీ నిఘా.. విమర్శల తుఫాను!
మార్కెట్ మానిప్యులేషన్‌ను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం కాస్తా, ముగింపు సమయంలో అనూహ్య వోలటైలిటీకి కారణమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా సెన్సెక్స్ ఆధారిత ట్రేడింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కొన్ని విదేశీ సంస్థలపై సెబీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ భారీ స్వింగ్స్, రూ. 1 లక్షకు రూ. 44 లక్షల లాభం లాంటి అంశాలు స్టాక్ మార్కెట్ వర్గాల్లో ప్రస్తుతం తీవ్రమైన హాట్ టాపిక్‌గా మారాయి.














Click it and Unblock the Notifications