భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు. లీటర్ పై ఏకంగా...
దేశంలోని వాహనదారులకు ప్రైవేట్ చమురు దిగ్గజం 'నయారా ఎనర్జీ' భారీ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, పెరిగిన ఉత్పాదక వ్యయాల భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయాలని కంపెనీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా పెట్రోల్ పంపులను నిర్వహిస్తున్న నయారా, పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్థానిక పన్నుల (VAT) ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో ఈ పెంపు లీటరుకు రూ.5.30 వరకు ఉండటం గమనార్హం.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం భారత ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు ఏకంగా 50 శాతం మేర పెరిగాయి. ఒక దశలో బ్యారెల్ ముడి చమురు ధర USD 119కి చేరినప్పటికీ, ప్రస్తుతం USD 100 వద్ద కొనసాగుతోంది. హార్ముజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలు, బీమా సంస్థల వెనకడుగు వంటి పరిణామాలు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.

ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలు..
దేశీయ మార్కెట్‌లో 90 శాతం వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ (IOC), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) మాత్రం సామాన్యుడిపై భారం పడకుండా సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచాయి. అయితే, ప్రభుత్వ మద్దతు లేని నయారా వంటి ప్రైవేట్ సంస్థలు పెరుగుతున్న నష్టాలను భరించలేక ధరల పెంపు వైపు మొగ్గు చూపాయి. ప్రైవేట్ రిటైలర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం లభించదు కాబట్టి, ధరలను పెంచడం తప్ప వారికి వేరే మార్గం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రీమియం పెట్రోల్, బల్క్ డీజిల్ ధరలకూ 'రెక్కలు'
సాధారణ ఇంధన ధరలు ప్రభుత్వ సంస్థల వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ, గత వారమే ఐఓసీ, బీపీసీఎల్ వంటి సంస్థలు ప్రీమియం (95-ఆక్టేన్) పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 మేర పెంచాయి. దీంతో ఢిల్లీలో ప్రీమియం పెట్రోల్ ధర రూ.101.89కి చేరింది. మరీ ముఖ్యంగా, పారిశ్రామిక వినియోగదారులకు విక్రయించే బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా రూ.22 మేర పెంచడం పారిశ్రామిక రంగంలో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర రూ.109.59 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరల నిర్ణయాధికారం చమురు కంపెనీల స్వయంప్రతిపత్తి అని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. గతేడాది రూ.81,000 కోట్ల రికార్డు లాభాలను గడించిన ప్రభుత్వ చమురు సంస్థలు, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆ లాభాలతో నష్టాలను భర్తీ చేస్తూ ధరలను నియంత్రణలో ఉంచుతున్నాయి. అయితే, ప్రైవేట్ బంకుల్లో రేట్లు పెరగడంతో వినియోగదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ బంకుల వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications