Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం

దేశంలోని సామాన్య బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద ప్రారంభించిన ఖాతాలతో సహా, సుమారు 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు (BSBDA) కనీస నిల్వ (Minimum Balance) నిబంధన వర్తించదని, వీటికి ఎటువంటి అపరాధ రుసుము ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్థిక సమ్మేళనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, చిన్న డిపాజిటర్ల కోసం బ్యాంకులు ఈ ఉచిత సేవలను అందిస్తున్నాయని ఆమె వివరించారు.

ఈ 72 కోట్ల ఖాతాదారులకు డిపాజిట్లు, నగదు విత్‌డ్రాలు, ఏటీఎం (ATM) సేవలు వంటి ప్రాథమిక సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని మంత్రి తెలిపారు. అయితే, జనరల్ సేవింగ్స్, కరెంట్ అకౌంట్లకు సంబంధించి మాత్రం కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (MAB) నిర్వహించని పక్షంలో బ్యాంకులు ఛార్జీలను వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఛార్జీలు ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, బ్యాంకులు అందించే సేవల ఖర్చులకు తగినట్లుగా ఉండాలని స్పష్టం చేశారు.

జరిమానాల ద్వారా రూ. 8,092 కోట్ల ఆదాయం

గత మూడు ఆర్థిక సంవత్సరాలలో (2022-23 నుంచి 2024-25 వరకు) ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాదారుల నుండి మొత్తం రూ. 8,092.83 కోట్లు వసూలు చేశాయని మంత్రి వెల్లడించారు. అయితే, ఈ మొత్తం బ్యాంకుల మొత్తం ఆదాయంలో కేవలం 0.23 శాతం మాత్రమేనని ఆమె గుర్తుచేశారు. బ్యాంకులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కాకుండా, నిర్వహణ వ్యయాలను తట్టుకోవడానికే ఈ రుసుములు విధిస్తున్నాయని ఆమె సమర్థించారు. కాగా, ఎస్‌బీఐ (SBI) వంటి బ్యాంకులు ఇప్పటికే కనీస బ్యాలెన్స్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయగా, 2025 నాటికి మరో తొమ్మిది ప్రభుత్వ బ్యాంకులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయని తెలిపారు.

మార్కెట్లోకి రూ. 50,000 కోట్ల నగదు విడుదల

మరోవైపు, దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత ఏర్పడకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలు చేపట్టింది. ముందస్తు పన్ను మరియు జీఎస్టీ చెల్లింపుల నేపథ్యంలో ఈ నెలాఖరులో నగదుకు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో, సోమవారం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ (OMO) ద్వారా రూ. 50,000 కోట్లను వ్యవస్థలోకి విడుదల చేసింది. దీని కోసం ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసింది. 2026 ప్రారంభం నుండి ఇప్పటివరకు ఆర్‌బీఐ మొత్తం రూ. 2.50 లక్షల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చొప్పించడం గమనార్హం.

రుణాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి

రాబోయే కాలంలో చెల్లింపుల ఒత్తిడిని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'స్విచ్ వేలం' విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా రూ. 6,309 కోట్ల విలువైన స్వల్పకాలిక బాండ్లను తిరిగి కొనుగోలు చేసి, వాటికి బదులుగా రూ. 6,431.79 కోట్ల విలువైన దీర్ఘకాలిక బాండ్లను (2033, 2039, 2062 గడువు గలవి) జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి జరిగిన నాలుగో స్విచ్ వేలం ఇది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గడువు ముగిసే రూ. 5.47 లక్షల కోట్ల రుణాల నిర్వహణను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+