No UPI Day: అక్టోబర్ 2న యూపీఐ సేవలు బంద్? నిజం ఏంటంటే..
అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా 'నో యూపీఐ డే' (No UPI Day) నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గాంధీ జయంతి రోజున ఆన్లైన్ పేమెంట్లకు దూరంగా ఉండాలంటూ వస్తున్న ఈ ప్రచారంపై దేశవ్యాప్తంగా వ్యాపారుల్లోనూ, వినియోగదారుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారమంతా పూర్తిగా నిరాధారమని, ఇందులో ఎలాంటి నిజం లేదని అఖిల భారత వర్తక సంఘం (CAIT) తాజాగా స్పష్టం చేసింది. తమ సంస్థ పేరుతో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.
ఈ అంశంపై స్పష్టతనిస్తూ సీఏఐటీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 2న 'నో యూపీఐ డే' పాటించాలని తమ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదని కుండబద్దలు కొట్టింది. ఎవరైనా తమ సంస్థ పేరును ఆపాదించి ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే అవి పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లేనని తేల్చిచెప్పింది. కేవలం అపోహల వల్లే ఇటువంటి వదంతులు సోషల్ మీడియాలో వేగంగా సర్క్యులేట్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

వారి నిర్ణయాలు మాకు ఆపాదించొద్దు
మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) సమస్యకు సంబంధించి కొన్ని ప్రాంతీయ సంఘాలు లేదా ఇతర వ్యాపార సంస్థలు సొంతంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చి ఉండొచ్చని సీఏఐటీ తెలిపింది. అలాంటి సంస్థల సొంత నిర్ణయాలను తమకు ఆపాదించడం సరికాదని స్పష్టం చేసింది. ఆ నిరసనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, సీఏఐటీ కూడా అందులో పాల్గొంటుందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు అయోమయానికి గురికావద్దని విజ్ఞప్తి చేసింది.
అధికారిక సమాచారమే నమ్మాలి.. మీడియాకు విజ్ఞప్తి
ఏవైనా వార్తలు ప్రచురించే లేదా ప్రసారం చేసే ముందు మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారిక వర్గాల ద్వారా నిజానిజాలు తెలుసుకోవాలని సీఏఐటీ కోరింది. వ్యాపార వర్గాల సంక్షేమాన్ని కాపాడుతూనే, దేశంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ మరింత వృద్ధి చెందేలా తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది. ఎటువంటి పుకార్లను నమ్మకుండా కేవలం అధికారిక ప్రకటనలనే పరిగణలోకి తీసుకోవాలని వ్యాపారులకు, సాధారణ ప్రజలకు సూచించింది.














Click it and Unblock the Notifications
