రూపాయి ఖేల్ ఖతం
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది. నాలుగో వారంలోకి ప్రవేశించిన తర్వాత కూడా దీనికి బ్రేకులు పడట్లేదు. ఈ పరిణామాలు భారత్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. నేడు రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యప్రాచ్య యుద్ధ ఆందోళనల మధ్య రూపాయి 94 మార్కును దాటింది. 94. 29 పైసలకు చేరింది. ఈ వారంలో నమోదైన 93.98 కనిష్టాన్ని ఇది అధిగమించింది.
గత నెల చివర్లో యుద్ధం మొదలైనప్పటి నుండి, భారత కరెన్సీ సుమారు 3.5 శాతం మేర బలహీనపడింది. యుద్ధ ప్రభావం దేశీయ కరెన్సీ మీద ఏ స్థాయిలో పడిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, సహజవాయువు ఇంధన సరఫరా సంక్షోభం కొనసాగుతోండటం, అంతర్జాతీయంగా డాలర్ బలపడటం వంటి పరిణామాలు రూపాయి పతనానికి ప్రధాన కారణం అయ్యాయి. మధ్యప్రాచ్య సంఘర్షణ చమురు సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగవచ్చనే భయాలను రేకెత్తించింది.

బ్యారెల్‌కు 110 పైన చమురు ధరల స్థిరత్వం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలు పెంచింది. దీని ప్రభావం కరెన్సీలనే కాకుండా గ్లోబల్ ఈక్విటీలు, బాండ్ మార్కెట్లపై కూడా పడింది. స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని చూడగా, బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై పెట్టుబడిదారుల ఆందోళనకు ఇది అద్దం పట్టింది. దీంతో పాటు రాబోయే 12 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచవచ్చని భావిస్తున్నారు.
బుధవారం సెషన్‌లో రూపాయి విలువ 93.96 వద్ద ముగిసింది. శ్రీరామనవమి కారణంగా గురువారం స్టాక్ మార్కెట్ కు సెలవు. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే రూపాయి పతనం కనిపించింది. ఇంటర్ బ్యాంకు విదేశీ మారకంలో అది 94.18 వద్ద ప్రారంభమై, 94.29కి క్షీణించింది. ఇది మునుపటి ముగింపు కంటే 33 పైసలు తక్కువ. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) నిధుల ఉపసంహరణ రూపాయిపై ఒత్తిడిని పెంచాయి.
కొద్ది రోజుల కిందటే 91 రూపాయల మార్క్ ను దాటింది రూపాయి విలువ.. అతి తక్కువ సమయంలోనే 93 రూపాయలను దాటింది. 93.83 పైసల వద్ద నిలిచింది. ఇది అత్యంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధార పడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ ఈ స్థాయికి పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తడిలోకి నెట్టినట్టవుతుంది.












Click it and Unblock the Notifications