లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల గోల్డ్: ఆర్బీఐ మాస్టర్ ప్లాన్
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తన వ్యూహాన్ని మార్చింది. విదేశీ గడ్డపై ఉన్న మన దేశ బంగారు నిల్వలను స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా అందిన గణాంకాల ప్రకారం, మార్చి 2026తో ముగిసిన కేవలం ఆరు నెలల కాలంలోనే ఆర్బీఐ ఏకంగా 104.23 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకుల నుంచి భారత్‌కు తరలించింది. అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మన సంపద మన దగ్గరే ఉండాలన్న ఆలోచనతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో భద్రంగా ఉన్న మొత్తం బంగారు నిల్వల పరిమాణం 290.37 మెట్రిక్ టన్నులకు (MT) చేరింది. గత ఏడాది (మార్చి 2025) నాటికి దేశంలో కేవలం 511.99 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే ఉండగా, కేవలం ఏడాది కాలంలోనే ఈ లెక్కలు భారీగా మారాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. ఇందులో సింహభాగం ఇప్పుడు మన దేశంలోని స్ట్రాంగ్ రూముల్లోనే భద్రంగా ఉంది.

విదేశీ బ్యాంకుల్లో ఎంత ఉంది?
ఒకప్పుడు మన దేశ బంగారంలో ఎక్కువ భాగం విదేశీ బ్యాంకుల్లోనే ఉండేది. అయితే తాజాగా తరలించిన బంగారం పోను, ప్రస్తుతం 197.67 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద ఉంది. అలాగే మరో 2.80 మెట్రిక్ టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉంది. గతంలో ఉన్న విదేశీ నిల్వలతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గింది.
సంపదలో బంగారం వాటా పైపైకి..
ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో, భారతదేశ విదేశీ మారక నిల్వల్లో (Forex Reserves) బంగారం విలువ ఒక్కసారిగా పెరిగింది. ఆరు నెలల క్రితం మన మొత్తం విదేశీ నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతంగా ఉండగా, 2026 మార్చి నాటికి అది 16.7 శాతానికి పెరిగింది. దీనివల్ల రూపాయి విలువకు మరింత బలం చేకూరడంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
విదేశీ కరెన్సీ నిల్వల పరిస్థితి..
కేవలం బంగారం మాత్రమే కాకుండా, విదేశీ కరెన్సీ ఆస్తుల విషయంలోనూ ఆర్బీఐ సమతుల్యతను పాటిస్తోంది. ప్రస్తుతం 552.28 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఆస్తులు ఉండగా, అందులో 465.61 బిలియన్ డాలర్లను వివిధ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెట్టింది. మిగిలిన మొత్తాన్ని ఇతర కేంద్ర బ్యాంకులు, బీఐఎస్ మరియు విదేశీ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.
మొత్తానికి, విదేశాల్లో ఉన్న మన బంగారాన్ని దేశానికి తీసుకురావడం ద్వారా ఆర్బీఐ అటు భద్రతను, ఇటు ఆర్థిక స్థిరత్వాన్ని ఒకే దెబ్బకు సాధిస్తోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే పరిణామం.














Click it and Unblock the Notifications