సమాధానాలివ్వకుండా ప్రసంగించడమెలా ? ప్రధాని నుంచి నేర్చుకుంది ఇదే- స్టాలిన్ సెటైర్లు..
తాజాగా పార్లమెంటులో సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని మోడీ.. రాహుల్ గాంధీ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబివ్వకపోవడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు.
పార్లమెంటులో కేంద్రం, ప్రధాని మోడీ తీరుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా విపక్షాలు అదానీ, బీబీసీ డాక్యుమెంటరీ వంటి కీలక అంశాలపై ప్రశ్నిస్తున్నా.. అవేవీ పట్టించుకోకుండా తనదైన శైలిలో సుదీర్ఘ ప్రసంగాలు చేసి వెళ్లిపోతున్న ప్రధాని మోడీ తీరును స్టాలిన్ ఆక్షేపించారు.
గంటల తరబడి ప్రసంగిస్తూ, ఇతరుల ప్రశ్నలకు సమాధానాలివ్వని కళను ప్రధాని మోడీ నుంచి తాను నేర్చుకున్నానంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ, బీజేపీపై చాలా విమర్శలు వస్తున్నాయని, కానీ ప్రజలే తనకు అండ అని మోడీ చెప్పుకుంటున్నారని స్టాలిన్ ఆక్షేపించారు. కానీ జనం అలా అనుకోవడం లేదన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంతో పాటు అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనం వహించడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు.

అదానీపై వచ్చిన ఆరోపణలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై వచ్చిన ప్రత్యక్ష ఆరోపణలని, సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ధర్మాసనం సైతం ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తోందని స్టాలిన్ తెలిపారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించి విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో కొన్ని అంశాలు రికార్డుల నుంచి తొలగించాలని నిర్ణయించడంపై కాంగ్రెస్ చేస్తున్న నిరనసలు సమంజసమేనని స్టాలిన్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి మాత్రమే తొలగించగలరని, జనం మెదళ్లలో నుంచి కాదన్నారు.
విపక్షాల్ని ఈడీ ఏకం చేస్తోందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన స్టాలిన్.. దేశ చరిత్రలో ఓ ప్రధాని తాను చేస్తున్న కక్షాపూరిత రాజకీయాల్ని అంగీకరించినట్లయిందన్నారు. ఇది ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తమిళనాడుకు సంబంధించి డీఎంకే ఎంపీలు లేవనెత్తిన ఏ ప్రశ్నకూ ప్రధాని సమాధానం చెప్పకపోవడం దారుణమని స్టాలిన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications