లోకేష్ అడ్డంగా దొరికారన్న రోజా .. చంద్రబాబు , లోకేష్ ల స్కామ్స్ పై సీబీఐ విచారణకు డిమాండ్
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కే రోజా చంద్రబాబుపై, నారా లోకేష్ పై విమర్శల వర్షం కురిపించారు. టిడిపి నేత నారా లోకేష్ ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో అడ్డంగా దొరికి పోయారని ఆమె వ్యాఖ్యానించారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్ పై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన రోజా చంద్రబాబు,లోకేష్ లపై నిప్పులు చెరిగారు.
దేవుడ్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు దరిద్రులు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్

లోకేష్ ఆ ఫైల్స్ పై సంతకం ఎందుకు పెట్టారు ? సీబీఐ విచారణ జరగాల్సిందే
తండ్రి అధీనంలో ఉన్న శాఖలో ఫైల్ పై లోకేష్ ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించిన రోజా టీడీపీ హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. అంతేకాదు రాజధాని అమరావతిలోనూ తండ్రి కొడుకులు ఇద్దరూ భారీ కుంభకోణం చేశారని రోజా వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పేర్కొన్నారు రోజా. అమరావతి చంద్రబాబుకి ఏటీఎం అని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారని, కాబట్టి అమరావతి భూ కుంభకోణంపై, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని రోజా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

చంద్రబాబు , లోకేష్ ల కుంభకోణాలు , చౌకబారు రాజకీయాలపై రోజా ఫైర్
తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబుకి సంబంధించిన సామాజిక వర్గం నేతలు మాత్రమే అమరావతిలో భూములు ఎలా కొనగలిగారని ప్రశ్నించారు రోజా. ఇక తాజాగా తిరుమల విషయంలోనూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు .సీఎం జగన్ అనేకమార్లు తిరుమలకు వెళ్లారని పేర్కొన్న రోజా జగన్ ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో ఆలయాలను కూల్చివేశారు అని, బూట్లతో పూజలు చేశారని ఆమె మండిపడ్డారు.

జగన్ తిరుమల దర్శనంపై నాడు లేని అభ్యంతరం నేడు దేనికో ?
సీఎం జగన్ కాలినడకన తిరుమల కొండకు వెళ్లారని, పాదయాత్రకు ముందు పాదయాత్ర తరువాత తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. గతేడాది ప్రధాని మోడీతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్న జగన్ పై నాడు లేని అభ్యంతరం ఈరోజు ఎందుకని ప్రశ్నించారు రోజా. కులాలకు ,మతాలకు అతీతమయిన నాయకుడుగా జగన్ ఉన్నారని, అనవసరపు రాద్ధాంతం మంచిదికాదని రోజా హితవు పలికారు. అన్ని మతాల వాళ్ళు ఆయనను నమ్మారని , కాబట్టే 151 సీట్లతో ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారని రోజా వ్యాఖ్యానించారు.