తూ.గో జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు- కరోనాలోనూ ఆగని కక్షలు- జగన్ సీరియస్..
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తితో జనం అల్లాడుతుంటే తూర్పుగోదావరి జిల్లా అధికార పార్టీలో మాత్రం ఆధిపత్య పోరు ఎక్కువైంది. కరోనా వైరస్ ను కూడా లెక్కచేయకుండా వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయి మరీ పోరు కొనసాగిస్తున్నారు. ఇందులో సాధారణ జనం నలిగిపోతున్నారు. ఈ వ్యవహారం కాస్తా వైసీపీ అధినేత, సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన తలపట్టుకుంటున్నారు.

తూర్పుగోదావరి వైసీపీలో ఆధిపత్యపోరు..
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. జిల్లా నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్ధాయి నేతలు లేకపోయినా రాజకీయాలకు మాత్రం ఎలాంటి కొదవలేదు. తాజాగా కరోనా వైరస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలోనూ రాజకీయాలకు దూరంగా ఉండలేని పరిస్ధితి జిల్లా నాయకులది. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్గానికీ, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వర్గానికి మధ్య ఆధిపత్య పోరు తాజాగా పతాకస్ధాయికి చేరింది.

దాడులతో కలకలం...
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన తోట త్రిమూర్తులు అనంతరం కేసుల భయంతో వైసీపీలోకి వచ్చేశారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఎన్నికైన చెల్లుబోయిన వేణును ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఎదుటే ఇరువర్గాలూ ఓసారి బాహాబాహీకి దిగాయి. అప్పట్లో ఆయన సర్దిచెప్పినా తర్వాత పరిస్ధితి షరా మామూలే. అయితే అప్పట్లో తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి చేసిన ఎమ్మెల్యే వేణు అనుచరుడు ఇజ్రాయెల్ పై తాజాగా హత్యాయత్నం జరిగింది. ఇందులో ఇజ్రాయెల్ తీవ్రంగా గాయపడి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆధిపత్య పోరుపై వైసీపీ బేజారు...
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రామచంద్రపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు వర్గం అదను చూసి తమ వర్గానికి చెందిన ఇజ్రాయెల్ పై దాడి చేయించడాన్ని ఎమ్మెల్యే వేణు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని అధిష్టానం పెద్దల వద్దే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అటు తోట త్రిమూర్తులు మాత్రం ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. అయితే సాధారణ కార్యకర్తలు మాత్రం రామచంద్రపురంలో నేతల ఆధిపత్య పోరుతో నలిగిపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచాక ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ తోట రాకతోనే పరిస్దితి ఉద్రిక్తంగా మారుతోందని వేణు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలపై సీఎం జగన్ ఆరా తీసినట్లు తెలిసింది. కరోనా వేళ నేతల ఆధిపత్య పోరుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.