ఆ కీలక హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ - హరిరామ జోగయ్య దీక్ష విరమణ
ఏలూరు: మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.. తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన ఆయనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి హామీ లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పవన్ చేసిన సూచనల మేరకు ఏలూరు ఆసుపత్రిలో దీక్షను విరమించారు.
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లను అమలు చేయాలంటూ హరిరామ జోగయ్య.. నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ కూడా రాశారు. తన ఉద్దేశమేంటో స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లను సాధించేంత వరకు దీక్ష విరమించబోనంటూ తేల్చి చెప్పారు. ముందుగా చెప్పినట్టే- హరిరామ జోగయ్య పాలకొల్లులోని తన నివాసంలో దీక్షకు విరమించడానికి సిద్ధపడ్డారు.

ఆయన వయస్సు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని రాత్రే పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. దీక్షకు దిగొద్దంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. దీనితో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో తన దీక్షను కొనసాగించారాయన. అనుమతి కోరినా పోలీసులు దీక్ష చేయడానికి అంగీకరించలేదని, అందుకే ఆసుపత్రిలోనే దీన్ని కొనసాగిస్తానని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న తరువాత పవన్ కల్యాణ్- ఆయనతో మాట్లాడారు. రాష్ట్రంలో మూర్ఖపు, మొండి ప్రభుత్వం అధికారంలో ఉందని, మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా పాలన సాగిస్తోందని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించు కుందామని హామీ ఇచ్చారు. హరిరామ జోగయ్య వంటి సీనియర్ నాయకులకు ఉన్నఅపారమైన రాజకీయ అనుభవం, విలువైన సూచనలు భవిష్యత్ లో అవసరమౌతాయని పేర్కొన్నారు.
వేరే రకంగా కాపు రిజర్వేషన్లను సాధించుకుందామంటూ పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హరిరామ జోగయ్య తన దీక్షను విరమించారు. కాపులపై వైఎస్ జగన్ కు ఏమాత్రం ప్రేమాభిమానాలు లేవని, తమ సామాజిక వర్గ ప్రజలు ఆర్థికంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు. తన మూడున్నరేళ్ల ప్రభుత్వ హయాంలో జగన్ కాపులకు ఒరగబెట్టిందేమీ లేదంటూ ఆరోపించారు.












Click it and Unblock the Notifications