కరోనా కలకలం: పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్, ఆ ఫ్యామిలీ మొత్తం క్వారంటైనలోకి..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, జరిగిన ఓ పొరపాటు ఇప్పుడు కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని కాకుండా కరోనా పాజిటివ్ వ్యక్తిని క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఇప్పుడు స్థానికంగా ఆందోళనకు దారితీసింది.

కరోనా పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్..
గుంటూరులోని కాటూరి వైద్య కళాశాల క్వారంటైన్ కేంద్రంలో ఇద్దరు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. అయితే, వారిద్దరి పేర్లూ ఒకటే. ఇద్దరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో ఒకరికి నెగిటివ్ అని తేలింది. దీంతో అయితే, సిబ్బంది పొరపాటున అతన్ని కాకుండా తాడేపల్లికి చెందిన వ్యక్తికి నెగెటివ్ వచ్చినట్లుగా ధృవపత్రంతోపాటు రూ. 2వేల నగదు అందజేసి శనివారం రాత్రి డిశ్చార్జ్ చేశారు.

తిరిగి ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరణ..
కానీ, ఆ నివేదిక అదే పేరుతో ఉన్న రెండో వ్యక్తిదని ఆదివారం గుర్తించారు అధికారులు. ఈ క్రమంలో తాడేపల్లికి చేరుకుని పాజిటివ్ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే ఆ వ్యక్తి ఇంట్లోని వారితో కలిసిపోయారు. తనకు నెగెటివ్ వచ్చిందంటూ ధృవపత్రం చూపించి, తిరిగి ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారు.

పోలీసులు రంగంలోకి..
ఈ క్రమంలో వైద్యాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి.. అతడిని 108 అంబులెన్స్‌లో ఎన్నారై వైద్యశాలలోని ఐసోలేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఆయన భార్య, కుమార్తె, మరో ఇద్దరిని కూడా క్వారంటైన్ తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా అతను మరెవరినైనా కలిశారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

ఏపీలో భారీగా నమోదవుతున్న కేసులు
ఇది ఇలావుండగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 722కు చేరింది. తాజాగా, నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు ఉండగా, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. 92 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 610 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications