గుంటూరులో ప్రబలిన డయేరియా: నిందలు వేయండని మంత్రి విడదల రజిని ఆగ్రహం!!
గుంటూరులో అతిసారం బారిన పడిన చాలామంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక గుంటూరులో అతిసారం కారణంగా మరణాలు జరిగాయని ప్రతిపక్షపార్టీలు విమర్శలు చేస్తున్నాయి . ఇప్పటికి ఇద్దరు డయేరియా కారణంగా మృత్యువాత పడ్డారని తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి విడదల రజిని ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి విషయంలో ఎంక్వయిరీ జరుగుతోందని, అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే చర్య తీసుకుంటామని విడదల రజిని పేర్కొన్నారు.

వైద్య సేవలు అందని బాధితులు 8341396104 ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని విడదల రజిని సూచించారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రులలో చేరిన బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని, ఈ మేరకు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని మంత్రి విడదల రజిని తెలిపారు. అయితే వీరంతా డయేరియాతో బాధపడుతున్నారా లేదా అనేది ల్యాబ్ రిపోర్ట్ లు వచ్చిన తర్వాత నిర్ధారణ అవుతుందని ఆమె తెలిపారు.
శనివారం నుంచి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్న రజిని ఇప్పటివరకు మేడికొండూరు, సిరిపురం, పేరేచర్ల, పల్నాడు జిల్లా, గురజాల, నరసరావుపేట తదితర ప్రాంతాలకు చెందిన 41 మంది బాధితులు ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. అయితే వారంతా అతిసారం బారిన పడినట్టు ఆమె నిర్ధారించలేదు.
ఇక ఇటీవల చనిపోయిన పద్మ కుటుంబానికి పరిహారం చెల్లింపు రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు విపక్షాలు అనవసరంగా యాగి చేస్తున్నాయని, ఏ కారణాలతో చనిపోయినా డయేరియా మరణాలని చెబుతున్నాయని మండిపడ్డారు. నిందలు వేయాలనుకుంటే వేయండి అంటూ అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications