మనసులోమాట చెప్పేసిన రాయపాటి.. వెంకన్న సన్నిధిలో వ్యాఖ్యలు.. కేసుల భయంతో?
తెలుగుదేశం పార్టీకి మరో కీలక నేత దూరం కానున్నారా? చంద్రబాబుకు హ్యాండిచ్చి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ ఎంపీల బాటలో మరింత మంది తమ్ముళ్లు పయనించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో పదిమంది మనహా మిగతావాళ్లు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకుంటూ.. సీఎం జగన్ కు జైకొడుండటం.. మాజీ టీడీపీ ఎమ్మెల్యేలు సైతం అదే బాటను అనుసరిస్తుండటం చూస్తున్నదే. ఇక గతంలో ఎంపీలుగా పనిచేసి, ఢిల్లీలో కాస్తో కూస్తో గుర్తింపున్న నేతలంతా బీజేపీవైపు మొగ్గుచూపుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ రాయపాటి సాంబశివరావు.
చంద్రబాబు 100 కోట్లు ఇస్తానన్నాడు.. అందుకే మునిగిపోయాం.. రాయపాటి సంచలన వ్యాఖ్యలు

కచ్చితంగా పార్టీ మారతా..
సీబీఐ కేసులు, యూనియన్ బ్యాంక్ తీవ్ర ఆరోపణలతో సతమతమవుతోన్న టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సమీప భవిష్యత్తులో కచ్చితంగా పార్టీ మారబోతున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. మారాల్సి వస్తే జాతీయ పార్టీనే ఎంచుకుంటానంటూ ‘బీజేపీ' పేరు ప్రస్తావించకుండా హింట్ ఇచ్చారు. ఈ మాటలు చెబుతూనే.. ‘‘ఇప్పట్లో పార్టీ మారే ఆలోచనేదీ లేదు''అని రాయపాటి అనడం గమనార్హం.

ఏ3 రాయపాటి..
కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టిన రాయపాటి.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి ఎంపీగానూ గెలుపొందారు. ఆయనకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి పోలవరం కాంట్రాక్టు దక్కడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుతం సీబీఐ దాడులు, కేసులు, బ్యాంకుల ఆరోపణల జడిలో రాయపాటి బ్యాడ్ టైమ్ ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై ఇటీవల దాడులు చేసిన సీబీఐ... సంబంధిత కేసుల్లో రాయపాటిని ఏ3గా పేర్కొంది. యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా ఆధ్వర్యంలోని కాన్సార్టియం నుంచి అప్పులు తీసుకున్న రాయపాటి.. నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఇతర పనులకు మళ్లించారనే ఆరోపణలున్నాయి.

కేసుల నుంచి ఉపశమనం పొందేందుకే..?
టీడీపీ నుంచి బీజేపీలోకి జంపైన రాస్యసభ సభ్యులందరూ ప్రమఖ వ్యాపారవేత్తలు కావడం, వాళ్లందరిపై మనీలాండరింగ్ లాంటి తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో ‘కేసుల నుంచి తప్పించుకోడానికే బీజేపీలో చేరారు'అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వాదనను పార్టీ వర్గాలు ఖండించాయి. ఇప్పుడు రాయపాటి విషయంలోనూ అలాంటి తరహా ప్రచారమే సాగుతోంది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై రాయపాటి చేసిన కామెంట్లు కూడా పార్టీ మారడంలో భాగంగా చేసినవేననే అనుమానం లేకపోలేదు. పోలవరం పనులకు సంబంధించి ట్రాన్స్ ట్రాయ్ కి చంద్రబాబు బిల్లులు చెల్లించకపోవడం వల్లే కంపెనీ కష్టాలపాలైందని రాయపాటి ఆరోపించారు.