గృహ హక్కు రగడ: జగన్ 1500 కోట్ల రాబడి స్కెచ్ .. ఆ డబ్బులు ఎవరూ కట్టొద్దన్న లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ గృహ హక్కు పథకం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గతంలో తీసుకున్న లోన్లు ఇప్పుడు చెల్లించాలని జగన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాల హయాంలో రుణాలు తీసుకున్న లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వైసీపీ సర్కార్ ఇళ్ల లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలుకు రంగం సిద్ధం చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

పేదల ఇళ్ళ రుణ మాఫీ పేరుతో డబ్బుల వసూళ్లు
జగనన్న సంపూర్ణ గృహ పథకం ద్వారా 1500 కోట్ల రూపాయలు రాబట్టాలని జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తుంది. అందులో భాగంగానే 1983 నుండి 2011 సంవత్సరాల మధ్య ఎవరైతే ఇళ్ల నిర్మాణానికి లోన్ తీసుకున్నారో ఆ లబ్ధిదారుల నుండి వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టింది. పేదల ఇళ్ల రుణమాఫీ పేరుతో డబ్బుల వసూళ్ళ ఎత్తుగడలు వేస్తున్నారని జగన్ సర్కార్ పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తుతున్నారు. అస్తవ్యస్త జాబితాలతో గ్రామ, వార్డు వాలంటీర్లకు హుకుం జారీచేసి వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గృహ హక్కు పథకంపై మండిపడుతున్న నారా లోకేష్
ఇప్పటికే బీజేపీ నేత లంకా దినకర్ జగన్ వసూళ్ల పర్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో వ్యాపార చాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, పేదల నుండి డబ్బులు దండుకోవడానికి జగన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా గృహ హక్కుపై జగన్ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడింది. ఓటిఎస్ పేరుతో 1500 కోట్ల రాబడికి జగన్ సర్కారు పెద్ద స్కెచ్ వేసిందని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇక తాజాగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పై మండిపడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషన్ అంటూ పదిహేను వందల కోట్ల రూపాయలు కొట్టేసే స్కెచ్
ఎన్టీఆర్ గారి హయాం నుండి వివిధ ప్రభుత్వాలు, పేదలకు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషన్ అంటూ పదిహేను వందల కోట్ల రూపాయలు కొట్టేసే స్కెచ్ వేశారని, ఎవరు ఒక్క రూపాయి కూడా కట్టొద్దు అని తేల్చి చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ కాని పేదల పక్కా ఇళ్లను, పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని నారా లోకేష్ తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రాలు ఉచితంగా ఇవ్వాలని, బలవంతంగా పేదల నుండి డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదని లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తున్న ప్రజలు
గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత గృహాలపై జగన్ ప్రభుత్వం ఇప్పుడు పెత్తనం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బలు ఇంకా కోలుకోలేక ఇబ్బందులు పడుతుంటే ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసే ఆలోచన ప్రభుత్వం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పథకాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని ఎవరైనా అడిగారా అంటూ మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా లబ్ధిదారులను డబ్బులు చెల్లించాలని ఇబ్బంది పెట్టడం దారుణమని అసహనం వ్యక్తం చేస్తున్నారు












Click it and Unblock the Notifications