జగన్ కాదంటే వ్యవసాయం చేసుకుంటానంటున్న ఎమ్మెల్యే!!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ నిర్వహించిన సమీక్షకు హాజరు కాకపోవడంపై ఏపీ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే ఆర్కే కు జగన్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందని, వచ్చే ఎన్నికల్లో ఆర్కేకి టికెట్ ఇవ్వరని, అందుకే సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్ కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాలేదని చర్చ జరుగుతుంది.
జగన్ పై వీరాభిమానంతో గతంలో తెలుగుదేశం పార్టీపై అనేక కేసులను వేసి ఇరకాటంలో పెట్టిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి దూరమవుతున్నారా? అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిన్న సమీక్షకు హాజరు కాకపోవడానికి కారణం ఏమిటి? అన్నది ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది. అయితే జగన్ కు తనకు మధ్య గ్యాప్ ఏర్పడిందని జరుగుతున్న ప్రచారానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మంగళగిరికి సంబంధించి ఏ నిర్ణయం అయినా జగన్ తీసుకుంటారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తను కట్టుబడి ఉంటాను అన్నారు.

వచ్చే ఎన్నికలలో తనకు టికెట్ ఇవ్వకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడి శుభకార్యానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న కారణంగా తాను సమావేశానికి రాలేకపోయినట్టు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. పార్టీకి తనకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాజకీయాల్లో ఉంటే తాను జగన్ తో పాటే ఉంటానని, రాజకీయం వద్దనుకుంటే వ్యవసాయం చేసుకుంటానని ఎమ్మెల్యే ఆర్కే తేల్చి చెప్పారు.
మా బాస్ జగన్.. ఆయన మాటే ఫైనల్ అంటూ ఆర్కే పేర్కొన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, దగ్గరగా ఉన్నంత మాత్రాన రోజూ జగన్ ను వెళ్లి కలవాల్సిన పని కూడా లేదని ఆయన వెల్లడించారు. జగన్ తనకు ఫ్యామిలీ మెంబర్ అంటూ పేర్కొన్న ఆర్కే, మంగళగిరిలో ఆర్కే గ్రాఫ్ ఎలా ఉందో కావాలంటే సర్వే చేసుకోవచ్చన్నారు. తాను పోటీ చేయకపోయినా మంగళగిరిలో వైసిపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆర్కే తన ప్రయాణం వైసీపీతో, జగన్ తోనే సాగుతుందని మరోమారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications