గుంటూరు జిల్లాలో వింతపురుగుల భయం .. కాపాడాలని అధికారులకు గ్రామస్తుల వినతులు, రీజన్ ఇదే !!
గుంటూరు జిల్లాలో వింత పురుగుల భయం ప్రజల్ని వెంటాడుతోంది . గత కొద్ది రోజులుగా గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో పలు గ్రామాలలో బొంత పురుగుల మాదిరిగా ఉన్న పురుగులు గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అనారోగ్యం పాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క అందరూ కరోనా మహమ్మారి గురించి భయపడుతుంటే , గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల వాసులకు మాత్రం ఈ విచిత్రమైన పురుగుల బాధ పట్టుకుంది .

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో వింత పురుగులు
అసలా పురుగులు ఎక్కడివి ? ఎలా వచ్చాయి ? వీటి నుంచి కాపాడుకోవడం ఎలా అని గ్రామస్తులు వింత పురుగుల దెబ్బకు లబోదిబోమంటున్నారు .ఈ పురుగులు మీద వాలిన, ఒంటి మీద పాకినా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఒళ్లంతా దద్దుర్లు, విపరీతమైన మంట, బాధతో మంచాన పడుతున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని విప్పర్ల పల్లి , అన్నవరప్పాడు, వీరాటం, సుబ్బయ్య పల్లి గ్రామస్తులు ఈ వింత పురుగుతో పడరాని పాట్లు పడుతున్నారు.

పురుగుల దెబ్బకు భయపడిపోతున్న గ్రామస్తులు , వాలితే నాలుగురోజులు దురద , దద్దుర్లు, మంట
ఎక్కడపడితే అక్కడ ఇంటా బయట అన్న తేడా లేకుండా ఈ పురుగులు పలు గ్రామాలలో తిరుగుతున్నాయి. ఎప్పుడూ ఇలాంటి పురుగులు చూడలేదని ఇది తమకు కొత్త సమస్యని గ్రామస్తులు వాపోతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఇళ్ళలో ఉన్నవారు సైతం ఈ పురుగుల దెబ్బకు భయపడుతున్నారు. ఇక ఈ పురుగు ఒకసారి వాలినా, ఒంటి మీద పాకినా నాలుగు రోజులపాటు దద్దుర్లు, దురద, మంట గ్రామస్తులకు నరకం చూపిస్తుంది .

అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు .. పురుగుల బారినుండి కాపాడాలని విజ్ఞప్తి
ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పురుగులు సుబాబుల్ తోటల వల్ల వస్తున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురుగు ఉనికిని కనిపెట్టి, అవి రాకుండా ఏదైనా పురుగు మందులు పిచికారీ చేసి తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో అధికారులు ఈ పురుగుల విషయంలో పరిశీలన జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications