ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం... 'బాలకృష్ణ గో బ్యాక్...', 'జై జగన్' అంటూ నినాదాలు...
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. హిందూపురంలోని 21వ వార్డు మోత్కుపల్లిలో 'బాలకృష్ణ గో బ్యాక్', 'జై జగన్...' అంటూ స్థానికులు నినాదాలు చేశారు. బాలకృష్ణ అక్కడికి ప్రచారానికి వెళ్లిన సమయంలో స్థానికులు వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ,వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి.

అసలేం జరిగింది...
సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో మోత్కుపల్లి వార్డులో ప్రచారానికి వైసీపీకి పోలీసులు అనుమతినిచ్చారు. అయితే అదే సమయంలో సమయంలో బాలకృష్ణ అక్కడికి వెళ్లి ప్రచారం చేయడంతో వివాదం చెలరేగింది. పైగా ఆ వార్డులో ఇదివరకే బాలయ్య ప్రచారం నిర్వహించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన స్థానికులు వైసీపీ కార్యకర్తలతో కలిసి బాలయ్యను అడ్డుకున్నారు.బాలకృష్ణ గో బ్యాక్', 'జై జగన్...' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పోలీసులు రంగంలోకి దిగడంతో...
వైసీపీకి అనుమతినిచ్చిన సమయంలో మీరెలా ప్రచారానికి వస్తారంటూ వైసీపీ శ్రేణులు బాలయ్యను నిలదీశారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, వైసీపీ అభ్యర్థి మారుతీరెడ్డిలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి బాలకృష్ణను అక్కడినుంచి పంపించేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం(మార్చి 8) చివరి రోజు కావడంతో వైసీపీ,టీడీపీలు విస్తృతంగా ప్రచారం చేశాయి.

హిందూపురంలో బాలయ్య మకాం...
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా బాలయ్య హిందూపురంలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ వార్డులో అభ్యర్థుల తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకుండా చూడటంలో సఫలమయ్యారు. ప్రచార క్రమంలో ఆయన ఓ అభిమానిపై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్య తనను టచ్ చేయడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని.. ప్రత్యర్థులు కావాలనే దీన్ని వివాదం చేస్తున్నారని ఆ అభిమాని వెల్లడించడం గమనార్హం. కాగా,మార్చి 10న రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు 12 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.