వైఎస్ఆర్సీపీలో హిందూపురం జోష్! పార్టీలో చేరిన మాజీ ఎంపీ
అనంతపురం: పోలింగ్ గడువు ముంచుకొస్తున్న ప్రస్తుత పరిస్తితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఘటన చోటు చేసుకుంది. హిందూపురం లోక్ సభ మాజీ సభ్యుడు, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు కల్నల్ నిజాముద్దీన్ వైఎస్ఆర్సీపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన హైదరాాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు హిందూపురం అసెంబ్లీ పరిధిలోని పలువురు ముస్లిం నాయకులు పార్టీలో చేరడం వైఎస్ఆర్సీపీలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమనే ధీమా వారిలో నెలకొంది.

కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు..
కల్నల్ నిజాముద్దీన్ స్వస్థలం అనంతపురం జిల్లాలోని కదిరి. గతంలో ఆయన కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగారు. 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హిందూపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై నిజాముద్దీన్ గెలుపొందారు. 2009లో ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ముస్లిం సామాజిక వర్గాల ఓటుబ్యాంకును ఆయన ప్రభావితం చేయగలరని వైఎస్ఆర్సీపీ విశ్వసిస్తోంది. వచ్చే ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ముస్లిం సామాజిక వర్గానికే చెందిన మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ ను బరిలో దింపిన విషయం తెలిసిందే.

ఇక్బాల్ ను గెలిపించుకుంటాం..
హిందూపురం అసెంబ్లీ సీటును ముస్లింకు కేటాయించడాన్ని కల్నల్ నిజాముద్దీన్ స్వాగతించారు. ఇక్బాల్ సహా పార్టీ హిందూపురం లోక్ సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. హిందూపురాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చినప్పటికీ.. ఏ ఒక్క పని కూడా చేయలేదని నిజాముద్దీన్ విమర్శించారు. కనీసం మంచినీటి వసతిని కూడా మెరుగుపర్చలేకపోయారని అన్నారు. ఈ సారి తాము ఇక్బాల్, మాధవ్ లను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిజాముద్దీన్ తో పాటు కదిరి, గోరంట్ల, హిందూపురం పట్టణాలకు చెందిన పలువురు ముస్లింలు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పోలింగ్ సమీపంలో ఉన్న సమయంలో.. ఈ చేరికల వల్ల వైఎస్ఆర్సీపీ లబ్ది పొందగలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు జగన్ తో భేటీ
అమలాపురం లోక్ సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ కుమారుడు శ్రీహర్ష గురువారం ఉదయం లోటస్ పాండ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాను మర్యాదపూరకంగా జగన్ ను కలిసినట్లు శ్రీహర్ష తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరిన మూడురోజులకే హర్షకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ వెంటనే- ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తోన్న అభ్యర్థులను గెలిపిస్తానని హామీ ఇచ్చారు జీవీ హర్ష కుమార్. అదే సమయంలో- శ్రీహర్ష జగన్ తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు మరికొందరు దళిత నేతలు జగన్ ను కలుసుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో హర్షకుమార్..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అమలాపురం లోక్ సభ టికెట్ ఆశించి, భంగపడ్డ జీవీ హర్షకుమార్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట స్థానాల్లో పోటీలో ఉన్న పార్టీ అభ్యర్థుల కోసం హర్షకుమార్ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడింట్లో అమలాపురం, రాజోలు, గన్నవరం స్థానాలు ఎస్సీ రిజర్వుడు. ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన హర్షకుమార్ కు ఆయా నియోజకవర్గాలపై మంచి పట్టు ఉంది. ఎన్నికల సమయంలో ఆయన టీడీపీని వ్యతిరేకించి, వైఎస్ఆర్సీపీలో చేరడం అనుకూలించే పరిణామమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications