18 ఏళ్లకు ఓటు ఓకే.. కానీ పెళ్లి వద్దా.. మోడీ సర్కార్‌పై అసద్ గరం గరం
పెళ్లికి మహిళల వయస్సు పెంపు దుమారం కంటిన్యూ అవుతుంది. తాజాగా మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. శీతాకాలంలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో మహిళల వివాహ వయసు పెంచేదుకు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానుందని సమాచారం. దీంతో అమ్మాయిల పెళ్లి వయసుపై చర్చ మొదలైంది.

ఇదీ సరికాదు
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదీ మన దేశంలో పితృస్వామ్యం ప్రభుత్వం అని చెప్పడానికి ఉదాహరణ. మన ప్రభుత్వం పొరిగింటి అంకుల్‌లాగా వ్యవహరిస్తోంది అని ఒవైసీ అటాక్ చేశారు. 18 ఏళ్లు నిండిన పురుషులు, మహిళలు ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చు, వ్యాపారాలు ప్రారంభించగలరు, ప్రధానమంత్రిని ఎన్నుకోగలరు.. ఎంపీలు , ఎమ్మెల్యేలను ఎన్నుకోగలను కానీ 18 ఏళ్లకు వివాహం మాత్రం చేసుకోలేరా అంటూ ట్విట్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలు ఏం తినాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో.. ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు.

చట్టం ఉన్నా..
బాల్య వివాహాలను నిషేధిస్తూ చట్టం ఉన్నప్పటికీ బాల్య వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఒవైసీ అన్నారు. దేశంలో ఏటా అనేకమంది బాలికలకు 18 ఏళ్లలోపు వివాహాలు జరుగుతున్నాయని.. అయితే దేశ వ్యాప్తంగా బాల్య వివాహాలపై 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. బాల్య వివాహాలు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయంటే దానికి కారణం చట్టం కాదు.. బాలికల్లో వచ్చిన విద్య , ఆర్థిక పురోగతి మాత్రమే కారణమని చెప్పారు. ప్రధాని మోడీకి నిజాయితీ ఉంటే మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించి ఉండేవారని ఒవైసీ అన్నారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గుతున్న ఏకైక దేశం మన దేశం అని చెప్పారు.

అక్కడ 14, 16 ఏళ్లకే
అమెరికా, న్యూజిల్యాండ్ దేశాల్లో మహిళలు 14, 16 వయస్సులో పెళ్లి చేసుకునేందుకు చట్టాలు అనుతిస్తున్నాయి. ఆయా దేశాలలో తక్కువ వయస్సులోనే నిర్ణయం తీసుకునే శక్తి వారిలో పెంపొదించడానికి అక్కడి ప్రభుత్వాలు చేసే చట్టాలు దోహదపడుతున్నయని ఒవైసీ కామెంట్ చేశారు. కానీ మనం మాత్రం వయసు పెంచుకుంటూ పోతున్నామని గుర్తుచేశారు.

ఆమోద ముద్ర
మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ తొలిసారి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను రక్షించాలంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21.. మహిళల వయసు 18 సంవత్సరాలు కల్పిస్తూ గతంలో కేంద్రం చట్టం చేసిన సంగతి తెలిసిందే.

నివేదిక సమర్పణ
బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నీతి ఆయోగ్‌లో జయ జైట్లీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ విధమైన మార్పులను కేంద్రం తీసుకురానుంది. గతేడాది జూన్‌లో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ.. ఆరు నెలల్లో నివేదిక సమర్పించింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ కీలక సూచన చేసింది. టాస్క్‌ఫోర్స్ సూచనలతో ఒక నివేదికను కేంద్రానికి నీతి ఆయోగ్ అందించింది. నీతి ఆయోగ్ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications