ఆ బైక్‌పై వెళ్లడమే శాపమైంది... ఒకరికి బదులు మరొకరిని మర్డర్ చేసిన గ్యాంగ్...
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ మర్డర్ కోసం స్కెచ్ వేసిన కొంతమంది దుండగులు పొరపాటున వేరే యువకుడిని హత్య చేశారు. నగరంలోని షాహిన్ నగర్‌లో బుధవారం తెల్లవారుజామున(సెప్టెంబర్ 23) ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే పరాన్ తనకు సబ్బుల ఫ్యాక్టరీ ఉందని నమ్మించి గతంలో కొంతమంది నుంచి రూ.18లక్షలు వరకు కాజేశాడు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు పరాన్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటినుంచి పరాన్ తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో మంగళవారం(సెప్టెంబర్ 22) రాత్రి పరాన్ ఇంటికి అతని స్నేహితులు షాహిన్ సయ్యద్ మోమిన్ అలీ(24),ఖాలెద్ వచ్చారు. రాత్రంతా ముగ్గురు కలిసి ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున పరాన్ తనకు ఆకలిగా ఉందని... బయటకెళ్లి ఏమైనా తీసుకురావాలని ఇద్దరు మిత్రులను పంపించాడు.
ఆ ఇద్దరూ పరాన్ బైక్‌పై ఫుడ్ పార్శిల్ తీసుకొచ్చేందుకు వెళ్లారు. అయితే మార్గమధ్యలో వారిని ఓ వాహనం వెంబడించి అడ్డగించింది. అందులో నుంచి కిందకు దిగిన నలుగురు వ్యక్తులు మోమిన్ అలీపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అప్పటికే ఖాలెద్ కూడా బైక్ దిగి పారిపోయాడు. స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మోమిన్ అలీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.
మోమిన్ అలీని చంపిన దుండగులు నిజానికి పరాన్‌ను హత్య చేసేందుకు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. మోమిన్ అలీ,ఖాలెద్ పరాన్ బైక్‌పై వెళ్లడంతో... పొరపాటున అలీని పరాన్ అని భావించినట్లు చెప్పారు. చీకట్లో ముఖం కూడా సరిగా కనిపించకపోవడంతో... దుండగులు అతనే పరాన్ అనుకుని బలితీసుకున్నట్లు చెప్పారు. ఒకవేళ మోమిన్ అలీ పరాన్ బైక్‌పై వెళ్లి ఉండకపోయి ఉంటే ప్రాణాలతో ఉండేవాడేమో.
పహాడీషరీఫ్ పరిధిలో పరాన్‌పై కేసు నమోదై ఉన్న నేపథ్యంలో... అతని చేతిలో మోసపోయిన బాధితులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా... లేక ఎవరితోనైనా విబేధాలే హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications