మల్లు స్వరాజ్యం కన్నుమూత.. నేతల నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతోబాధపడుతున్న ఆమె శనివారం సాయంత్రం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. స్వరాజ్యం 10 ఏళ్ల వయసులో మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం.. నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిట సింహస్వప్నమై నిలిచారు.
1945 నుంచి 1948 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నిజాం సర్కారును గడగడలాడించారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొలడంలో మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించింది. నా మాటే తుపాకీ తూటా పేరుతో ఆత్మకథలు రాశారు. స్వరాజ్యం జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేవారు. స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978-1983, 1983-1984 సంవత్సరాలలో రెండుసార్లు సి.పి.ఐ.(ఎం) పార్టీ నుంచి గెలుపొందారు.

వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక 'చైతన్య మానవి' సంపాదకవర్గంలో స్వరాజ్యం కూడా ఒకరు. నాడు దొరల దురహంకారాన్ని నిరసిస్తు జనాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. స్వరాజ్యం దళంలో మహిళ కమాండర్‌గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. స్వరాజ్యం మృతితో కమ్యునిస్టు నేతలు నివాళులు అర్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications