trs cm kcr telangana panchayat elections election code cabinet expansion assembly టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఎన్నికల కోడ్ కేబినెట్ విస్తరణ మంత్రివర్గ విస్తరణ అసెంబ్లీ
మంత్రివర్గ విస్తరణకు మరో గండం.. ఫిబ్రవరి వరకు కొత్త అమాత్యులకు నో ఛాన్స్
హైదరాబాద్ : మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న ఎమ్మెల్యేలకు నిరాశే మిగులుతోంది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి రోజులు గడుస్తున్నా.. మంత్రివర్గ విస్తరణ ఊసే లేదు. రేపు మాపు అంటూ వార్తలొచ్చినా.. ఎప్పటికప్పుడు డిలే అవుతూనే ఉంది.
మంత్రివర్గ విస్తరణ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న తరుణంలో మరో అడ్డంకి ఎదురైంది. దీంతో కేబినెట్ విస్తరణ ఫిబ్రవరి వరకు ఉండబోదని స్పష్టమవుతోంది. డిసెంబర్ చివరికల్లా ఎట్టిపరిస్థితుల్లో మంత్రివర్గ కూర్పు జరిగిపోతుందని కొందరు లెక్కలేశారు. అది కుదరలేదు. పైగా జనవరిలో కూడా కొత్త అమాత్యులకు ఛాన్స్ లేనట్లేనని తేలిపోయింది.

మరో 30 రోజులు బ్రేక్
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఈసారి పంచాయతీ ఎలక్షన్లు అడ్డంకిగా మారాయి. ఎన్నికల నిబంధనల మేరకు కేబినెట్ విస్తరణకు ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది ఈసీ. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో మంత్రివర్గం కూర్పు ఇప్పట్లో లేనట్లే. జనవరి చివరివరకు విడతలవారీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. ఈనెల మంత్రివర్గ విస్తరణ లేదనే విషయం స్పష్టమవుతోంది. ఈ లెక్కన కేబినెట్ విస్తరణ ఫిబ్రవరిలో జరిగే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మరో 16 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశముంది. దీంతో ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రి పదవుల కోసం దాదాపు నలుగురైదుగురు పోటీపడుతున్నట్లు సమాచారం. అదలావుంటే మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అమాత్యుల ఎంపికలో పలు అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరో నెలరోజుల్లో 2 కొత్త జిల్లాలు.. నారాయణపేట, ములుగు ఏర్పాటు స్పీడప్

ఎన్నికల కోడ్ దెబ్బ..!
మంత్రివర్గ విస్తరణలో తొలుతగా 6 నుంచి 8 మందిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు తమకు ఛాన్సొస్తుందా లేదా అని తర్జనభర్జన పడుతున్నారు. అయితే కేసీఆర్ మొదట కేబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారనేదానిపై క్లారిటీ లేదు. డిసెంబర్ చివరినాటికి కూడా మంత్రి పదవుల బెర్తులు కన్ఫామ్ కాకపోయేసరికి కొత్త సంవత్సరంపై ఆశలు పెట్టుకున్నారు. తీరా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోడ్ దెబ్బ కొట్టింది. దీంతో ఫిబ్రవరి వరకు కేబినెట్ విస్తరణ ఊసు లేనట్లే. మంత్రి పదవుల పంపకంలో ఇంతలా ఆలస్యం జరుగుతుండటంతో కీలకమైన మరికొన్ని పోస్టుల ప్రక్రియ కూడా డిలే కానుంది.
పంచాయతీ ఎన్నికలు జనవరి చివరికల్లా ముగియనున్నాయి. అయితే ఫిబ్రవరి 7 వరకు మంచిరోజులు లేవు. దీంతో పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసినా కూడా మరో వారం రోజులు కేబినెట్ విస్తరణ కోసం ఆగాల్సిందే. ఒకవేళ అన్నీ కుదిరితే ఫిబ్రవరి 7 తర్వాత మంత్రి పదవులకు మోక్షం కలగనుంది. అదలావుంటే 16 మంత్రి పదవులకు గాను ఫిబ్రవరిలో 6-8 మందిని కేబినెట్ లోకి తీసుకుని మిగతావారికి లోక్ సభ ఎన్నికల తర్వాతే ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

అధ్యక్షా..!
ఈసారి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఆశగా ఎదురుచూస్తున్నారు. గెలిచి 20 రోజులకు పైనే అవుతున్నా.. ఇంతవరకు ప్రమాణం చేయలేని పరిస్థితి. ఇక పంచాయతీ ఎన్నికల కోడ్ తో మరో నెలరోజులు కూడా అసెంబ్లీ సమావేశాలకు ఛాన్స్ లేనట్లే. ఒకవేళ ప్రభుత్వం ఎమర్జెన్సీగా భావిస్తే తప్ప శాసనసభ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ లేదు. దీనికి కూడా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మొత్తానికి ఫిబ్రవరి నెల అన్నింటికీ కలిసి వస్తుందేమో. అటు అసెంబ్లీ సమావేశాలు గానీ, ఎమ్మెల్యేల ప్రమాణం గానీ, మంత్రివర్గ విస్తరణ గానీ.. ఇలా ఏదానికైనా రెండో నెలనే అచ్చొచ్చేటట్లుగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలు తప్పనిసరిగా ఫిబ్రవరిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. దీని కారణంగా గంపగుత్తలా అన్నీ కార్యాలు అప్పుడే జరిగే అవకాశముంది.