Hyderabad: సిగ్నల్ పడిందని ఆటో ఆగింది.. చెట్టు పడి ఆటో డ్రైవర్ మృతి..
మనం ఏది మాట్లాడుకున్నా.. ఏం చేసినా.. చివరికి జరిగేదే జరుగుతుందని అంటారు. అన్నింటికన్నా విధి గొప్పదని చెబుతుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో ఈ మాటలు నిజమనిపిస్తాయి. ఓ ఆటో సిగ్నల్ పడిందని ఆగింది. అప్పుడే ఓ చెట్టు ఆటోపై పడింది. ఆటోలో ఉన్న డ్రైవర్ మృతి చెందాడు. అయితే అప్పుడు ఎలాంటి గాలులు రాలేదు. కానీ ఉన్నట్టుండి చెట్టు మాత్రం పడిపోయింది. దీన్నే విధి అంటారేమో అని అక్కడున్నవారు మాట్లాడుకున్నారు.
ఇంతకి ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే జరిగింది. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సిగ్నల్ వద్ద భారీ వృక్షం ఒక్కసారిగా కింద పడిపోయింది. అదే సమయంలో సిగ్నల్ దగ్గర నిలుచున్న ఆటోపై చెట్టు పడడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టు కిందపోడిపోవడంతోనే వాహనదారులు తమ వాహనాలు వదిలి పారిపోయారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది.

సోమజిగూడ ఎమ్ ఎస్ మక్త ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ గౌస్ పాషా హిమాయత్ నగర్ నుంచి బషీర్ బాగ్ వైపు వెళ్తున్నాడు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆటోను ఆపాడు. అయితే అప్పుడే ఫుట్ పాత్ పై ఉన్న భారీ వృక్షం కూలి నేరుగా ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా స్పాట్ లోనే చనిపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని చెట్టును తొలగించారు.
పోలీసులు ఆటోలో ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆటోపై చెట్టు కూలుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాలులు లేకున్నా.. చెట్టు పడడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.












Click it and Unblock the Notifications